ఐటీ వృద్ధి మందగించింది
♦ అందుకే కొత్త నియామకాలు, ప్రమోషన్ల అవకాశాల తగ్గుదల
♦ భారీగా ఉద్యోగాల కోతలేమీ లేవు
♦ ఇన్ఫీ క్రిస్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యలు
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్తగా నియామకాలు, ప్రమోషన్ల అవకాశాలు తగ్గడానికి ఐటీ రంగం వృద్ధి మందగించడమే కారణమని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ చెప్పారు. ఐటీలో భారీగా ఉద్యోగాల కోతల వార్తలను ఆయన కొట్టిపారేశారు. ‘వృద్ధి రేటు తగ్గినప్పుడు.. కొత్తగా ఉద్యోగులను తీసుకోవాల్సిన అవసరం కూడా తక్కువగా ఉంటుంది. రెండోదేమిటంటే.. మరింత ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం లేనందువల్ల ప్రమోషన్ అవకాశాలూ కూడా తగ్గుతాయి‘ అని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వూ్యలో క్రిస్ పేర్కొన్నారు. ‘భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడాన్ని నేనైతే చూడలేదు.. వినలేదు. సాధారణంగా ప్రమోషన్ల ప్రక్రియ ఎప్పుడూ కఠినతరం అవుతూనే ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది‘ అని ఆయన వివరించారు.
ఇకపైనా ప్రమోషన్ల ప్రక్రియ కఠినతరంగా ఉంటుందని, మదింపు ప్రక్రియ మరింత కఠినతరం అవుతుందని క్రిస్ చెప్పారు. అయితే ఐటీ రంగంలో ఇది సర్వసాధారణమని.. గతంలో 2001లో, 2008లోనూ ఇలాంటివే చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఐటీ రంగ వృద్ధిపై ప్రస్తుతం పలు అంశాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు. భారత ఐటీ ఎక్కువగా ఆధారపడే అమెరికా, యూరప్‌లో వృద్ధి మందగించడం ఒక కారణం కాగా, ప్రస్తుతం కూడా మెరుగైన వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. ఇప్పటికే దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భారీగా పెరగడంతో ’బేస్ ఎఫెక్ట్’ వల్ల అది నామమాత్రంగానే కనిపిస్తుండవచ్చని క్రిస్ చెప్పారు.
ఐటీ ఉద్యోగుల యూనియన్ అనవసరం..
ఐటీ రంగ ఉద్యోగులు యూనియన్ ఏర్పాటు ప్రతిపాదనపై స్పందిస్తూ.. ఇది సరైన యోచన కాదని క్రిస్ వ్యాఖ్యానించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ ఉద్యోగులు భారీ జీతాలే అందుకుంటున్నారని, కంపెనీలూ వారిని బాగానే చూసుకుంటున్నాయని, పైగా ఉద్యోగాలు మారేందుకు వారికి అనేక అవకాశాలూ ఉన్నాయన్నారు. ‘ఐటీలో యూనియన్ ఏర్పాటు ఆలోచన సరికాదు. ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వారికైతే అది అర్థవంతంగా ఉంటుంది. కానీ, ఐటీ రంగం అలాంటిది కాదు.
ఉద్యోగులకు మంచి జీతాలు ఉంటాయి. అలాగే ప్రత్యామ్నాయంగా అవకాశాలూ ఉంటాయి’ అని క్రిస్ చెప్పారు. ఐటీలో ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైన కీలక విభాగాల్లో ఇప్పటికీ సిబ్బంది అవసరమన్నారు. సరైన నిపుణులు దొరకని అమెరికా కంపెనీలు.. భారత్ వైపు మొగ్గు చూపొచ్చని క్రిస్ పేర్కొన్నారు.