జీఎస్‌కే కేన్సర్ ఔషధ వ్యాపారం నొవార్టిస్ చేతికి | Novartis, Glaxo in deal to transform firms, industry | Sakshi
Sakshi News home page

జీఎస్‌కే కేన్సర్ ఔషధ వ్యాపారం నొవార్టిస్ చేతికి

Published Wed, Apr 23 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

జీఎస్‌కే కేన్సర్ ఔషధ వ్యాపారం నొవార్టిస్ చేతికి

జీఎస్‌కే కేన్సర్ ఔషధ వ్యాపారం నొవార్టిస్ చేతికి

లండన్: గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు జీఎస్‌కే, నొవార్టిస్‌ల మధ్య కేన్సర్ ఔషధ బిజినెస్‌కు సంబంధించి డీల్ కుదిరింది. మూడు భాగాలుగా కుదుర్చుకున్న డీల్‌లో భాగంగా జీఎస్‌కేకు చెందిన కేన్సర్ ఔషధ పోర్ట్‌ఫోలియోను నొవార్టిస్ 1,600 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 96,000 కోట్లు) కొనుగోలు చేస్తుంది. ఇదే విధంగా నొవార్టిస్‌కు చెందిన 701 కోట్ల డాలర్ల(సుమారు రూ. 42,000 కోట్లు) విలువైన వాక్సిన్ల బిజినెస్‌ను జీఎస్‌కేకు విక్రయిస్తుంది. వీటితోపాటు వినియోగదారుల ఆరోగ్య సంరక్షణ(కన్సూమర్ హెల్త్‌కేర్) బిజినెస్‌ను నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేస్తాయి. రెండు కంపెనీలూ విడిగా జారీ చేసిన ప్రకటనల్లో ఈ విషయాలను వెల్లడించాయి. జీఎస్‌కే కన్జూమర్ బిజినెస్‌తో నొవార్టిస్‌కు చెందిన ఓటీసీ విభాగాన్ని జత చేయనున్నారు. తద్వారా వార్షికంగా 10 బిలియన్ డాలర్ల విలువైన కన్జూమర్ హెల్త్‌కేర్ బిజినెస్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపాయి. కొత్త జేవీలో యూకే కంపెనీ జీఎస్‌కేకు అత్యధికంగా 63.5% వాటా ఉంటుంది. 
 
 డీల్ వివరాలివీ...
 జీఎస్‌కేకు చెందిన కేన్సర్(అంకాలజీ) ఔషధ ఉత్పత్తులను స్విట్జర్లాండ్‌కు చెందిన నొవార్టిస్ 14.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుంది. దీంతోపాటు ఔషధాల అభివృద్ధినిబట్టి 150 కోట్ల డాలర్ల ప్రత్యేక(మైల్‌స్టోన్) చెల్లింపులను చేపట్టనుంది. తద్వారా జీఎస్‌కే అంకాలజీ ఆర్‌అండ్‌టీ ఉత్పత్తులకు సంబంధించిన ప్రస్తుత, భవిష్యత్ హక్కులు నొవార్టిస్‌కు సంక్రమించనున్నాయి. మరోవైపు ఫ్లూ మినహా వాక్సిన్ల బిజినెస్‌ను నొవార్టిస్ 7.01 బిలియన్ డాలర్లకు విక్రయించనుంది. రాయల్టీలు అదనంకాగా, తొలుత 5.25 బిలియన్ డాలర్లు, మైల్‌స్టోన్ చెల్లింపుల్లో భాగంగా మరో 1.8 బిలియన్ డాలర్లు నొవార్టిస్‌కు లభించనున్నాయి.
 
 ఇండియాలో ఎఫెక్ట్ తక్కువే
 మాతృ సంస్థ జీఎస్‌కే, నొవార్టిస్‌ల మధ్య కుదిరిన డీల్ దేశీయ(ఇండియా) బిజినెస్‌పై ప్రభావం చూపబోదని జీఎస్‌కే కన్జూమర్ ెహ ల్త్‌కేర్ పేర్కొంది. రెండు అంతర్జాతీయ సంస్థలూ తమ కన్జూమర్ బిజినెస్‌లను ఏకీకృతం చేస్తున్నప్పటికీ, దేశీ కన్జూమర్ హెల్త్‌కేర్ బిజినెస్‌ను మినహాయించినట్లు జీఎస్‌కే కన్జూమర్ బీఎస్‌ఈకి వెల్లడించింది. కాగా, ఈ ఏడాది మొదట్లో దేశీ సంస్థలో జీఎస్‌కే తన వాటాను 75%కు పెంచుకున్న  విషయం విదితమే. బీఎస్‌ఈలో జీఎస్‌కే కన్జూమర్ హెల్త్‌కేర్ షేరు యథాతథంగా రూ. 4,368 వద్ద ముగిసింది.
 
 క్రోసిన్ ట్యాబ్లెట్ల ధరలు 50% వరకూ తగ్గాయ్
 న్యూఢిల్లీ: జ్వరంతోపాటు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే క్రోసిన్ ట్యాబ్లెట్ల ధరలు 50% వరకూ తగ్గిస్తూ గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ ఆసియా నిర్ణయం తీసుకుంది. 2013 ఔషధ ధరల నియంత్రణ ఆదేశాల(డీపీసీవో)మేరకు దేశవ్యాప్తంగా క్రోసిన్ ధరను 50% స్థాయిలో తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ధరల తగ్గింపు నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రస్తుతం క్రోసిన్ అడ్వాన్స్ ఫాస్ట్ రిలీజ్ 500 ఎంజీ 15 ట్యాబ్లెట్ల స్ట్రిప్ ధర రూ. 30కు లభిస్తోంది. కాగా, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అధారిటీ(ఎన్‌పీపీఏ) ఈ మాలిక్యూల్ గల ఒక్కో ట్యాబ్లెట్ ధర 94 పైసలు మించకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఇకపై క్రోసిన్ స్ట్రిప్ రూ. 14కు లభించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement