Novartis
-
చిన్నారి ఎలెన్‌కు భరోసా
దుమ్ముగూడెం: బోసినవ్వులతో ఆడుకోవాల్సిన పసిపాప జన్యుపరమైన వ్యాధి బారిన పడి రెండేళ్లుగా కొట్టుమిట్టాడుతోంది. చికిత్సకు అవసరమైన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన ‘నోవార్టిస్’ ఉచితంగా అందజేయడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వీరి పాప ఎలెన్‌కు రెండేళ్లు. మెడ భాగం దృఢంగా లేకపోవడంతో కిందకు వాలిపోతుండటాన్ని పాప నాలుగు నెలల వయసున్నప్పుడే తల్లిదండ్రులు గమనించారు. వయసు పెరుగుతున్నా పాప శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమస్య ఏమిటో తేలలేదు. ఆ తర్వాత చెన్నైలోని వేలూరు మెడికల్ కాలేజీకి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఎలెన్ జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, సత్వరమే వైద్యం చేయించాలని సూచించారు. పాపను రక్షించుకోవాలంటే రూ.16కోట్ల విలువైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ చేయించాలని చెప్పారు. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలైన ప్రవీణ్–స్టెల్లా కుప్పకూలి పోయారు. ఈ విషయమై ‘సాక్షి’తో పాటు ఇతర పత్రికలు, చానళ్లలో కథనాలు రాగా, విషయం స్విట్జర్లాండ్‌లోని నోవార్టిస్ సంస్థ దృష్టికి వెళ్లింది. దీంతో సదరు సంస్థ యాక్సెస్ ప్రోగ్రాంలో భాగంగా జూలై నెలలో ఎలెన్‌కు ఉచితంగా ఇంజె క్షన్ ఇచ్చేందుకు ఎంపిక చేసింది. నిర్ణయించిన ప్రకారం.. ఎలెన్‌కు శనివారం సికింద్రాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో ఇంజెక్షన్ వేశారు. పాప ప్రాణానికి ఇబ్బంది లేదని, ఇకనుంచి కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పినట్లు ప్రవీణ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, పాపకు నయం కావాలని ప్రార్థనలు చేసిన వారితోపాటు కథనాలు రాసిన మీడియాకూ ప్రవీణ్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
అతి ఖరీదైన ఇంజెక్షన్, తయారీకి ఎంత టైం పడుతుందో తెలుసా?
(సాక్షి,వెబ్ డెస్క్) అరుదైన జన్యు వ్యాధి, అంతకంటే అరుదైన మందు. చిన్నారుల పాలిట మృత్యుపాశమై వెంటాడుతున్న ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటే ధనికులకే కత్తిమీద సాము. ఇక సామాన్యులు పరిస్థితి చెప్పనలవికాదు. ఎంత గొప్ప ఇన్సూరెన్సులైనా దీని ఖరీదు ముందు బలాదూర్. అదే ‘స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ)’ డిసీజ్. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే కోట్లాది రూపాయలు ఎందుకు వెచ్చించాలి; దీనికి పరిష్కారమే లేదా? నిపుణులు ఏమంటున్నారు. కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన జన్యు వ్యాధి ఇది. వెన్నెముక కండరాలను ప్రభావితం చేసే ఈ వ్యాధి రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ‘స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ)’ గా పిలిచే ఈ వ్యాధిలో ఇందులో పలు రకాలకు, వివిధరకాలు చికిత్సలు ఉండగా, అన్నీ ఖరీదైనవే. అసలు ఈ పేరు వింటేనే తల్లితండ్రుల గుండెల్లో రైళ్లు. ఎందుకంటే రూ.18 కోట్ల విలువైన జోల్జెన్స్మా ఇంజక్షన్ తీసుకోవాలి. అది కూడా అమెరికాలోనే మాత్రమే దొరుకుతుంది. ప్రపంచంలో అత్యంత కాస్ట్ లీ మెడిసిన్‌గా నిలిచిన దీన్ని నోవార్టిస్ కంపెనీ ఒక్కటే ఉత్పత్తి చేస్తుంది. సామాన్య, నిరుపేద కుటుంబాలు అంత పెద్ద మొత్తాన్ని సమర్చుకోవాలంటే సాధ్యమైనపనేనా? అందుకే ఈ డబ్బును సమకూర్చు కునేందుకు తల్లిదండ్రులు క్రౌడ్సోర్సింగ్ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడ సంతోషించదగ్గ పరిణామం ఏమిటంటే..సెలబ్రిటీలనుంచి సామాన్యుల దాకా దాతల అపూర్వ స్పందన, తద్వారా చాలామంది చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడటం. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఐదు నెలల పాప తీరా కామత్, హైదరాబాద్‌కు చెందిన అయాన్షు గుప్త లాంటి వాళ్లు మృత్యువును ఓడించగా, అయాన్స్, ఖయాతి లాంటి చిన్నారులు ఇంకా సాయంకోసం ఎదురు చూస్తున్నారు. ఎస్ఎంఏను ఎలా గుర్తించాలి? వెన్నెముక కండరాల క్షీణత అనేది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా నవజాత శిశువులు లేదా పిల్లలలో మొదట ఈ వ్యాధికి సంబంధించి లక్షణాలు కనిపిస్తాయి. అంటే పసివాళ్లుగా ఉన్నపుడే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం కీలకం. పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నా క్రమంగా బలహీనంపడతారు. ముఖ్యంగా నెలల వయసులోనే వారి కదలికలను గమనించాల్సి ఉంటుంది. తల నిలపలేకపోవడం, బోర్లా పడకపోవడం, పాకలేకపోవడం లాంటివి గమనించినపుడు తల్లిదండ్రులు మొదట అనుమానించాలి. ఇంకా కదలికలు బలహీనంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో, మింగడంలో ఇబ్బందులను ప్రమాదకర సూచనలుగా గ్రహించాలి. ఆలస్యం చేయకుండా జన్యుపరమైన పరీక్షలు చేయించాలని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ సూచిస్తున్నారు. ఎందుకంటే రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే ఈ ఇంజక్షన్ ఇస్తారు. 90 శాతం కేసులలో శాశ్వత వెంటిలేషన్ లేదా మరణానికి దారి తీస్తుంది. అంతేకాదు చికిత్సకు అంతపెద్ద మొత్తంలో డబ్బును సేకరించడం మరో సవాల్. జోల్జెన్స్మా ఎందుకింత ఖరీదు? ఎస్ఎంఏ చికిత్సలో ప్రాచుర్యంలోకి వచ్చిన రెండో ఔషధం జోల్జెన్స్మా. జర్నల్ ఆఫ్ హెల్త్ ఎకనామిక్స్ ప్రచురించిన 2016నాటి అధ్యయనం ప్రకారం, ఈ డ్రగ్ విలువ 2.6 బిలియన్ డాలర్లు. ఈ మందు సింగిల్ డోస్ తయారీకి 10 సంవత్సరాలకు పైగా పడుతుంది. ఈ ఔషధం అసలు పేరు ఓనసెమ్నోజీన్ అబెపర్వోవెక్ అయితే జోల్జెన్స్మా అనే బ్రాండ్ పేరుతో విక్రయాలు సాగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్జెన్స్మా డ్రగ్ భారతదేశంలో లభ్యం కాకపోవడం ప్రధాన కారణం. వైద్య నిపుణుల సలహా మేరకు స్విస్ బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవార్టిస్ ఉత్పత్తి చేస్తోన్న ఈ ఔషధాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం, దానిపై దిగుమతి పన్ను మరో కారణం. జీఎస్టీ, ఇతర పన్నులు రూపంలోనే రూ.6 కోట్ల వరకు చెల్లించాలంటేపరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చాలా అరుదుగా 10వేలమందిలో ఒక చిన్నారికి సంభవించే ఈ వ్యాధి నివారణకు సంబంధించిన డ్రగ్ అభివృద్ధి ప్రక్రియ, పరిశోధనలో గణనీయమైన ఖర్చులుంటాయి. ఫార్మా నిపుణుల సమాచారం ప్రకారం ఇదే మందును మన దేశంలో తయారు చేస్తే ప్రస్తుత ధరతో పోలిస్తే మూడు, లేదా నాలుగో వంతు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో మన చిన్నారులను కాపాడేందుకు ఈ ఔషధాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో దిగుమతి సుంకం భారం కూడా తగ్గుతుందనీ, దీనిపై కేంద్రం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ మందు ఉత్పత్తికి డీసీజీఐ లైసెన్స్ ఇవ్వడంతోపాటు, కొనుగోలు శక్తిని బట్టి దేశీయంగా ధర నిర్ణయించడం ఒక్కటే పరిష్కారమని నిపుణుల వాదన. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ)వ్యాధి లక్షణాలను బట్టి నాలుగు రకాలుగా పేర్కొంటారు. ఎంఎస్ఏ టైప్-1, టైప్-2,3 4.కూడా ఉన్నాయి. ప్రధానంగా ప్రాణాంతక టైప్-1 బారిన పడిన చిన్నారులు సగటు జీవిత కాలం రెండేళ్లు మాత్రమే. ఈ లోపుగానే ఇంజక్షన్ అందాలి. మరోవైపు టైప్ 3, 4 బారిన పడిన పిల్లల ప్రాణాలకు ప్రమాదం లేకున్నా, శరీరంలోని నాడులు క్షీణించే లక్షణం కారణంగా మిగిలిన పిల్లలతో పోలిస్తే పెరుగుదల లోపాలుంటాయి. టైప్-1 బారిన పడిన చిన్నారులు అందరి పిల్లల్లా నడవ లేరు.. కూర్చోలేరు. చివరికి ఆహారం కూడా మింగలేనంతగా కండరాలు బలహీన పడిపోతాయి. ఊపిరితిత్తుల బలహీనత, శ్వాస సమస్యలు తలెత్తుతాయి. చివరికి పక్షవాతానికి దారితీసి పిల్లల ప్రాణాలను హరిస్తుంది. వీటిన్నిటికీ పరిష్కారమే వండర్ డ్రగ్ జోల్జెన్స్మా. నరానికి ఇచ్చే ఈ సింగిల్ డోస్ ఇంజెక్షన్ ద్వారా చిన్నారులు కూడా ప్రాణాపాయం నుంచి గట్టెక్కుతారు. నరాల పనితీరుకు అవసరమైన ప్రోటీన్లను ఇది ఉత్పత్తి చేస్తుంది, కండరాల కదలికను ఉత్తేజితం చేస్తుంది. బిడ్డ బరువు ఆధారంగా ఈ మోతాదు నిర్ణయిస్తారు. దీంతో పని చేయకుండా పోయిన జన్యువు పనితీరును ఒకే ఒక్క మోతాదుతో భర్తీ చేస్తుంది. కండరాల క్షీణతను అడ్డుకుంటుంది. దీంతో కండరాలు, నరాల వ్యవస్థ తిరిగి పుంజుకుని బాధితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి వచ్చే అవకాశాలుంటాయి. ఎస్ఎంఏ చికిత్స కు ఇతర ప్రత్యామ్నాయ మందులు ►పిల్లలు, పెద్దల్లో ఈ వ్యాధి చికిత్సకు అనుమతినిచ్చిన తొలి ఔషధం స్పిన్రాజా (నూనినెర్సెన్). ఈ ఔషదాన్ని 2016, డిసెంబరులో యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదించింది. వెన్నుపాము చుట్టూ ఉన్న ద్రవంలోకి ఈ ఇంజెక్షన్‌ను అందిస్తారు. ► రెండు నెలల వయస్సులోపు చిన్నారులకు చికిత్స నిమిత్తం ఎఫ్‌డీఏ అనుమతినిచ్చిన మూడో ఔషధం ఎవ్రిస్డి (రిస్డిప్లామ్). నోటి ద్వారా అందించే మొదటి డ్రగ్‌ను లాంచ్ చేస్తున్నట్టు 2020 ఆగస్టులో ఎఫ్‌డిఎ ప్రకటించింది. మరికొన్ని ఔషధాలు క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. క్యూర్స్మా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎంఏ బాధిత చిన్నారుల తల్లిదండ్రుల నేతృత్వంలోని సంఘమే క్యూర్ స్మా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. 2014లో 10కుటుంబాలతో ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది. దేశ వ్యాప్తంగా ఆయా కుటుంబాలకు అండగా ఉంటూ వారికి కౌన్సెలింగ్, రిసోర్స్ పూల్, అవగాహనా శిబిరాలతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందిస్తుంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారినుంచి చిన్నారులను కాపాడుకోవడం, న్యూరాన్లు క్షీణతను నిరోధించి మరణాలను అడ్డుకోవడం పెద్ద విజయమని క్యూర్స్మా ఫౌండేషన్ కో ఫౌండేషన్ డైరెక్టర్ అర్చన పాండా వ్యాఖ్యానించారు. -
ప్రపంచంలోనే కాస్ట్లీ మెడిసిన్.. ఒక్కడోసు రూ.18 కోట్లు
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ ఔషధం ఖరీదు ఎంత ఉండొచ్చని భావిస్తున్నారు? లక్ష, పదిలక్షలు, కోటి పదికోట్లు.. అంతేనా! కానీ తాజాగా నోవార్టిస్ ఉత్పత్తి చేసిన జోల్జెన్స్మా ఔషధం ఒక్క డోసు ఖరీదు తెలుసుకుంటే ఆశ్చరపోవడం ఖాయం. ఎస్ఎంఏ(స్పైనల్ మస్కులార్ అట్రోపీ) టైప్1 చికిత్సకు వాడే జోల్జెన్స్మా అనే ఔషధం ఒక్కడోసు ఖరీదు రూ. 18.20 కోట్లు. ఎస్ఎంఏ వ్యాధి చాలా అరుదుగా చిన్నారుల్లో కనిపిస్తుంది. ఇది సోకిన పిల్లల కండరాలు బలహీనపడి పక్షవాతం వచ్చినవారిలాగా కదల్లేకపోతారు. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో 90 శాతం మంది మరణిస్తుంటారు. ఈ క్రూరవ్యాధిని నివారించేందుకు నోవార్టిస్ జీన్ థెరపీస్ కంపెనీ జోల్జెన్స్మా అనే ఔషధాన్ని తయారు చేసింది. అయితే ఈ వ్యాధిని జోల్జెన్స్మా పూర్తిగా నిరోధించలేదు. కానీ వ్యాధి పురోగమించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఎస్ఎంఏ సోకిన పిల్లలు వెంటిలేటర్ అవసరంలేకుండా గాలిపీల్చుకోగలగడమే కాకుండా, నెమ్మదిగా పాకడం, కూర్చోవడం, నడవడం కూడా చేయగలుగుతారు. ఈ ఔషధానికి ఇంగ్లాండ్‌కు చెందిన ఎన్హెచ్ఎస్ వాడుక అనుమతులిచ్చింది. దీని శాస్త్రీయనామం ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్. వైద్య చరిత్రలో ఈ ఔషధం తయారీ ఒక విప్లవాత్మక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో ముంబైకి చెందిన దంపతులు వారి చిన్నారి కోసం ఈ మందును తెప్పించుకున్నారు. చదవండి: విషాదం: రూ.16 కోట్ల ఇంజక్షన్.. ఆ పాప ఇక లేదు -
మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అరబిందో
హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అవతరించనుంది. సాండోజ్ డీల్‌తో కంపెనీపై రుణ భారం పెరిగింది. నోవార్టిస్ కంపెనీ అయిన సాండోజ్ వాణిజ్య కార్యకలాపాలు, మూడు తయారీ ప్లాంట్లను అరబిందో ఫార్మా రూ.6,300 కోట్లు వెచ్చించి గతేడాది సెప్టెంబర్ లో కొనుగోలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ భారం రూ.1,050–1,400 కోట్లు తగ్గుతుందని అరబిందో సీఎఫ్‌వో సంతానం సుబ్రమణియన్ తెలిపారు. గత మూడు త్రైమాసిక ఫలితాలనుబట్టి మూడేళ్లలో రుణ రహిత కంపెనీ అవుతుందని చెప్పారు. 2019 జూన్‌తో పోలిస్తే సెప్టెంబర్ నాటికి సంస్థ నికర రుణాలు రూ.497 కోట్లు తగ్గి రూ.3,654 కోట్లకు వచ్చి చేరాయి. -
‘నోవార్టిస్’ను విస్తరిస్తాం
సాక్షి, హైదరాబాద్: నోవార్టిస్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ), డేటా సపోర్ట్, అనలిటిక్స్ కార్యకలాపాలు కొనసాగిస్తోందని, హైదరాబాద్‌లో తమ సంస్థ సాధిస్తున్న పురోగతిపై సంతృప్తిగా ఉన్నట్లు ఆ సంస్థ పబ్లిక్ పాలసీ విభాగాధిపతి పెట్రా లక్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సంస్థ నిర్వహిస్తున్న ఔషధ ప్రయోగశాల సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు వెల్లడించారు. పరిశోధన విభాగంలో మరో 150 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపారు. నోవార్టిస్ కార్యకలాపాల విస్తరణతో జీనోమ్ వ్యాలీ అభివృద్ధికి దోహదపడనుందని, పూర్తి వివరాలను కంపెనీ త్వరలో వెల్లడిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో నిర్మిస్తున్న ఫార్మా సిటీలో పెట్టుబడులు పెట్టాలని నోవార్టిస్‌ను ఆహ్వానించారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో కేటీఆర్ రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమై ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించారు. మిత్సుబిషీతో.. రాష్ట్రంలో జపనీస్ చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కును ఏర్పాటు చేయాలని ఆ దేశ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మిత్సుబిషీని కేటీఆర్ కోరారు. మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కెన్ కవాయి బృందంతో ఆయన సమావేశమయ్యారు. భారీ ప్రాజెక్టుల అవకాశాలకు తమ కంపెనీ చూస్తోందని మిత్సుబిషీ ప్రతినిధులుమంత్రికి తెలిపారు. పారిశ్రామికవాడలు, వేస్ట్ మేనేజ్మెంట్ తదితర ప్రాజెక్టులపై మిత్సుబిషీకి ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులకు రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని, కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటించాలని మంత్రి ఆహ్వానించారు. జపాన్ పర్యటనలో ఇలాంటి పార్కు ఏర్పాటుకు జైకా వంటి ఆర్థిక సంస్థలు రుణాలందించేందుకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని వారికి వివరించారు. సౌర విద్యుదుత్పత్తిలో రాష్ట్రం ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కువైట్‌కు చెందిన ఫవద్ అల్గానిమ్ కంపెనీ సీఈవో మహ్మద్ అల్గానిమ్తో సమావేశమై రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు అందుతున్న సహకారాన్ని వివరించారు. రాష్ట్రంలో టెక్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ సంస్థను కేటీఆర్ కోరారు. ఎయిర్ ఏషియాతో.. ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో ఆంథోనీ ఫెర్నాండేజ్, ఉప కార్యనిర్వహణాధికారి ఎయిరీన్ ఒమర్‌తో కేటీఆర్ సమావేశమై హైదరాబాద్‌లో ఎయిరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరించారు. రానున్న రోజుల్లో దేశంలో విమానయాన రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఎయిర్ ఏషియాను ఆహ్వానించారు. హెచ్‌పీ కంపెనీతో.. ప్రముఖ హార్డ్‌వేర్ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ), టీ–హబ్‌ల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని పరిశీలించాలని కేటీఆర్ కోరారు. హెచ్‌పీ కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలని ఆ కంపెనీ ఉపాధ్యక్షుడు అనా పిన్కుజుక్కు విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సర్క్యులర్ అవార్డు గెలుచుకున్న టీ–హబ్‌లోని బనయన్ నేషన్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు మనీ వాజపేయ్ దావోస్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వాజ్‌పేయ్ బృందానికి అభినందనలు తెలిపారు. -
నోవార్టిస్‌తో టీ-హబ్ ఎంవోయూ
హైదరాబాద్: ఆరోగ్య రంగంలో సాంకేతికతను పెంచేదిశగా టీ-హబ్ నోవార్టిస్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్(ఎన్హెచ్పీఎల్)తో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. రాష్ట్రంలో హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌టెక్ అంశాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్‌తో కలిసి నోవార్టిస్ పనిచేస్తుంది. నోవార్టిస్‌కు చెందిన ఆరోగ్య, పరిశోధన, అభివృద్ధి రంగాల నిపుణులు టీ-హబ్ సమన్వయంతో స్టార్టప్ సంస్థలకు మార్గనిర్దేశం చేస్తారని టీ-హబ్ సీఈవో జే కృష్ణన్ తెలిపారు. ఫార్మారంగంలో మరిన్ని పరిశోధనలకు ఈ అవగాహన ఒప్పందంతో ఎంతో తోడ్పడుతుందని నోవార్టిస్ ప్రతినిధి సుబోధ్ దేశ్‌ముఖ్ తెలిపారు. -
సన్‌ఫార్మా చేతికి నోవార్టిస్ క్యాన్సర్ ఔషధం
ఒప్పందం విలువ 17.5 కోట్ల డాలర్లు న్యూఢిల్లీ: నొవార్టిస్‌కు చెందిన క్యాన్సర్ ఔషధాన్ని ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా కొనుగోలు చేస్తోంది. నొవార్టిస్‌కు చెందిన ఒడొమ్జో అనే క్యాన్సర్ ఔషధాన్ని 17.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనున్నామని సన్ ఫార్మా తెలిపింది. దీనికి సంబంధించిన తమ, తమ అనుబంధ కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఈ ఔషధం కొనుగోలుతో తమ బ్రాండెడ్ క్యాన్సర్ ఔషధాల పోర్ట్‌ఫోలియో మరింతగా విస్తరిస్తుందని సన్‌ఫార్మా గ్లోబల్ హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్) కీర్తి గనోర్కర్ తెలిపారు. ఈ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఈ ఏడాది జూలైలో ఆమోదం లభించింది. ఈ ఔషద కొనుగోలు వార్త నేపథ్యంలో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ ఇంట్రాడేలో రూ.625 గరిష్ట స్థాయిని తాకి, చివరకు 0.8 శాతం నష్టంతో రూ.609 వద్ద ముగిసింది. -
నోవార్టిస్ చేతికి అమెరికా ఫార్మా కంపెనీ
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన నొవార్టిస్ కంపెనీ అమెరికాకు చెందిన సెలెక్సిస్ ఫార్మాస్యూటికల్స్ కార్ప్‌ను కొనుగోలు చేసింది. ఈ అమెరికా కంపెనీని 66.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసినట్లు నొవార్టిస్ తెలిపింది. ఆఫ్రికా ప్రజల్లో సాధారణంగా వచ్చే రక్తహీనత చికిత్సలో ఉపయోగించే సెల్జీ1 ఔషధాన్ని సెలెక్సిస్ పార్మా తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి లక్షలాది ప్రజలను బాధిస్తోందని, కానీ ఈ వ్యాధి వల్ల తలెత్తే నొప్పులను నివారించే ఔషధాలు తక్కువగా ఉన్నాయని, అందుకే ఈ కంపెనీని కొనుగోలు చేశామని నొవార్టిస్ సీఈఓ(ఆంకాలజీ) బ్రూనో స్ట్రింజిని పేర్కొన్నారు. -
పేటెంట్ కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై తెవా దావా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పేటెంట్ ఉల్లంఘన కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై లా సూట్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెవా ఫార్మా ప్రకటించింది. కొపాగ్జోన్ జెనరిక్ వెర్షన్‌కు సంబంధించి డాక్టర్ రెడ్డీస్ నుంచి పారా-4 నోటిఫికేషన్ అందిందని, దీన్ని సవాలు చేస్తూ లా సూట్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెవా తెలిపింది. నాడీ వ్యవస్థ దెబ్బతిని వివిధ భాగాలు పనిచేయని వ్యాధి చికిత్సకు ఈ కొపాగ్జోన్ను వినియోగిస్తారు. -
జీఎస్కే కేన్సర్ ఔషధ వ్యాపారం నొవార్టిస్ చేతికి
లండన్: గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు జీఎస్కే, నొవార్టిస్‌ల మధ్య కేన్సర్ ఔషధ బిజినెస్‌కు సంబంధించి డీల్ కుదిరింది. మూడు భాగాలుగా కుదుర్చుకున్న డీల్‌లో భాగంగా జీఎస్కేకు చెందిన కేన్సర్ ఔషధ పోర్ట్‌ఫోలియోను నొవార్టిస్ 1,600 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 96,000 కోట్లు) కొనుగోలు చేస్తుంది. ఇదే విధంగా నొవార్టిస్‌కు చెందిన 701 కోట్ల డాలర్ల(సుమారు రూ. 42,000 కోట్లు) విలువైన వాక్సిన్ల బిజినెస్‌ను జీఎస్కేకు విక్రయిస్తుంది. వీటితోపాటు వినియోగదారుల ఆరోగ్య సంరక్షణ(కన్సూమర్ హెల్త్‌కేర్) బిజినెస్‌ను నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేస్తాయి. రెండు కంపెనీలూ విడిగా జారీ చేసిన ప్రకటనల్లో ఈ విషయాలను వెల్లడించాయి. జీఎస్కే కన్జూమర్ బిజినెస్‌తో నొవార్టిస్‌కు చెందిన ఓటీసీ విభాగాన్ని జత చేయనున్నారు. తద్వారా వార్షికంగా 10 బిలియన్ డాలర్ల విలువైన కన్జూమర్ హెల్త్‌కేర్ బిజినెస్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపాయి. కొత్త జేవీలో యూకే కంపెనీ జీఎస్కేకు అత్యధికంగా 63.5% వాటా ఉంటుంది. డీల్ వివరాలివీ... జీఎస్కేకు చెందిన కేన్సర్(అంకాలజీ) ఔషధ ఉత్పత్తులను స్విట్జర్లాండ్‌కు చెందిన నొవార్టిస్ 14.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుంది. దీంతోపాటు ఔషధాల అభివృద్ధినిబట్టి 150 కోట్ల డాలర్ల ప్రత్యేక(మైల్స్టోన్) చెల్లింపులను చేపట్టనుంది. తద్వారా జీఎస్కే అంకాలజీ ఆర్‌అండ్‌టీ ఉత్పత్తులకు సంబంధించిన ప్రస్తుత, భవిష్యత్ హక్కులు నొవార్టిస్‌కు సంక్రమించనున్నాయి. మరోవైపు ఫ్లూ మినహా వాక్సిన్ల బిజినెస్‌ను నొవార్టిస్ 7.01 బిలియన్ డాలర్లకు విక్రయించనుంది. రాయల్టీలు అదనంకాగా, తొలుత 5.25 బిలియన్ డాలర్లు, మైల్స్టోన్ చెల్లింపుల్లో భాగంగా మరో 1.8 బిలియన్ డాలర్లు నొవార్టిస్‌కు లభించనున్నాయి. ఇండియాలో ఎఫెక్ట్ తక్కువే మాతృ సంస్థ జీఎస్కే, నొవార్టిస్‌ల మధ్య కుదిరిన డీల్ దేశీయ(ఇండియా) బిజినెస్‌పై ప్రభావం చూపబోదని జీఎస్కే కన్జూమర్ ెహ ల్త్‌కేర్ పేర్కొంది. రెండు అంతర్జాతీయ సంస్థలూ తమ కన్జూమర్ బిజినెస్‌లను ఏకీకృతం చేస్తున్నప్పటికీ, దేశీ కన్జూమర్ హెల్త్‌కేర్ బిజినెస్‌ను మినహాయించినట్లు జీఎస్కే కన్జూమర్ బీఎస్ఈకి వెల్లడించింది. కాగా, ఈ ఏడాది మొదట్లో దేశీ సంస్థలో జీఎస్కే తన వాటాను 75%కు పెంచుకున్న విషయం విదితమే. బీఎస్ఈలో జీఎస్కే కన్జూమర్ హెల్త్‌కేర్ షేరు యథాతథంగా రూ. 4,368 వద్ద ముగిసింది. క్రోసిన్ ట్యాబ్లెట్ల ధరలు 50% వరకూ తగ్గాయ్ న్యూఢిల్లీ: జ్వరంతోపాటు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే క్రోసిన్ ట్యాబ్లెట్ల ధరలు 50% వరకూ తగ్గిస్తూ గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ ఆసియా నిర్ణయం తీసుకుంది. 2013 ఔషధ ధరల నియంత్రణ ఆదేశాల(డీపీసీవో)మేరకు దేశవ్యాప్తంగా క్రోసిన్ ధరను 50% స్థాయిలో తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ధరల తగ్గింపు నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రస్తుతం క్రోసిన్ అడ్వాన్స్ ఫాస్ట్ రిలీజ్ 500 ఎంజీ 15 ట్యాబ్లెట్ల స్ట్రిప్ ధర రూ. 30కు లభిస్తోంది. కాగా, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అధారిటీ(ఎన్పీపీఏ) ఈ మాలిక్యూల్ గల ఒక్కో ట్యాబ్లెట్ ధర 94 పైసలు మించకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఇకపై క్రోసిన్ స్ట్రిప్ రూ. 14కు లభించనుంది. -
కొపాక్సోన్పై నాట్కో ఫార్మాకి దెబ్బ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్సొన్ జెనరిక్ వెర్షన్‌ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసి అధికాదాయం పొందుదామనుకున్న నాట్కో ఫార్మా ఆశలపై టెవా ఫార్మా నీళ్లు జల్లింది. నాడీ సంబంధిత వ్యాధుల నివారణకు వినియోగించే కొపొక్సొన్ పేటెంట్ హక్కులపై టెవా ఫార్మా లేవనెత్తిన వాదనలు వినడానికి అమెరికా సుప్రీంకోర్టు సమ్మతించింది. వచ్చే రెండు నెలల్లో మార్కెట్లోకి విడుదల చేయడానికి నాట్కో ఫార్మా రంగం సిద్ధం చేసుకుంటుండగా ఇప్పుడు టెవా సుప్రీంకోర్టుకు ఎక్కడంతో జాప్యం తప్పకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ గత ఏడాది అమెరికాలోని కింది కోర్టు ఇతర కంపెనీలతో కలిసి ఈ ఔషధాన్ని విక్రయించడానికి నాట్కోకి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో కొపాక్జోన్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి నాట్కో ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ప్రపంచ జెనరిక్ ఔషధ కంపెనీల్లో మొదటి స్థానంలో ఉన్న టెవా వ్యాపారంలో 20 శాతం కొపాక్జోన్ నుంచి వస్తుండటమే కాకుండా, లాభాల్లో 50 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది అమెరికాలో కొపాక్సొన్ అమ్మకాల విలువ రూ. 25,200 కోట్లుగా నమోదయ్యింది. నమ్మకం ఉంది టెవాకి చెందిన 808 పేటెంట్ చెల్లదన్న నమ్మకాన్ని నాట్కో ఫార్మా వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. మైలాన్, మొమెంటా ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి కొపాక్సొన్ను అమెరికాలో విక్రయించడానికి నాట్కోకి గతేడాది అనుమతి లభించింది. ప్రస్తుత వార్తల నేపథ్యంలో మంగళవారం నాట్కో ఫార్మా షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 14శాతం నష్టపోయి రూ.685 వద్ద ముగి సింది. కొపాక్సొన్ జెనరిక్ వెర్షన్‌పై నాట్కో హక్కులు పొందినప్పటి నుంచి ఆదాయం బాగా పెరుగుతుం దన్న అంచనాతో నాట్కో ఫార్మా షేరు దూసుకుపోయింది. ఇప్పుడు ఈ అంశం తిరిగి కోర్టు పరిధిలోకి వెళ్ళడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారని, ప్రస్తుత స్థాయి నుంచి 10 శాతం మించి పతనం అయ్యే అవకాశాలు కనిపించడం లేదని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి అభిప్రాయపడ్డారు.