హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కళ్లజోడును ఒకప్పుడు అవసరంగానే చూసేవారు. అందుకే పెద్దగా డిజైన్లుండేవి కావు. కానీ ఇప్పుడు!! ఇదో ఫ్యాషన్. దాంతో కొత్త కంపెనీలొచ్చాయి. ఆన్‌లైన్ కంపెనీలూ పుట్టాయి. వేల డిజైన్లలో ఆకట్టుకునే ఫ్రేమ్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయ్.
సరైన కళ్లజోడు అందాన్ని పెంచుతుండటంతో... అలాంటి ఫ్రేమ్‌ల కోసం కస్టమర్లు ఎంతైనా వెచ్చిస్తున్నారు. పైపెచ్చు కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం, స్మార్ట్‌ఫోన్ల వాడకం అధికమవడం... కళ్ల జోళ్ల అవసరాన్ని కూడా పెంచుతున్నాయి. దీంతో రూ.6,000 కోట్ల భారత కళ్లజోళ్ల పరిశ్రమలో ఇప్పుడిప్పుడే వ్యవస్థీకృత రంగం తన వాటాను పెంచుకుంటోంది.
మారుతున్న ట్రెండ్...
ఫ్రేమ్స్ డిజైన్ల విషయంలో ట్రెండ్ మారుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ కూడా ఇందుకు తీసిపోవడం లేదు. పారదర్శకంగా ఉండే రంగురంగుల ఫ్రేమ్స్, వుడెన్ ఎఫెక్ట్, టార్టాయిస్ షెల్, మార్బుల్ స్టైల్, గోల్డ్ మెటల్ వైర్ ఫ్రేమ్స్ హవా నడుస్తోంది.
క్యాట్ ఐ, సెమి రిమ్‌లెస్, ఏవియేటర్ స్టైల్, మందమైన రౌండ్ షేప్ ఫ్రేమ్స్ ఇప్పుడు పాపులర్ అయ్యా యని ఖమ్మంకు చెందిన కళ్లజోళ్ల షాప్ యాజమని జ్యోతిర్మయి తెలిపారు. భారత్‌లో అమ్ముడవుతున్న ఫ్రేమ్స్‌లో 70% విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. సింథటిక్ లెన్స్ పూర్తిగా ఇంపోర్ట్ చేస్తున్నారు.
అత్యధికం రూ.1,500 లోపువే..
ఫ్రేమ్స్‌లో సింథటిక్, మెటల్, టైటానియం, గోల్డ్ రకాలున్నాయి. మొత్తం పరిశ్రమలో రూ.1,500 లోపు ధరలో లభించే ఫ్రేమ్స్ వాటా ఏకంగా 65 శాతం. రూ.1,500–5,000 శ్రేణి 30 శాతం, రూ.5 వేలపైన లభించే ఉత్పత్తుల వాటా 5 శాతం ఉంది.
ప్రీమియం విభాగంలో మోబ్లా, కరెరా, కార్టియర్ వంటి బ్రాండ్లు పోటీపడుతున్నాయి. రూ.1 లక్షల పైచిలుకు ధరలోనూ ఫ్రేమ్స్ లభిస్తున్నాయి. లెన్స్ రకాన్నిబట్టి ధర రూ.50 వేల వరకూ ఉంది. కస్టమర్లు తమ తొలి ఫ్రేమ్‌ను తక్కువ ధరలో కొంటున్నారని, రెండోసారి కాస్త ఖరీదైంది తీసుకుంటున్నారని టైటన్ కంపెనీ ఎండీ భాస్కర్ భట్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.
ఇదీ కళ్లజోళ్ల మార్కెట్..
దేశవ్యాప్తంగా కళ్లజోళ్ల మార్కెట్ పరిమాణం రూ.6,000 కోట్లు. దీన్లో మూడింట రెండొంతులు అవ్యవస్థీకృత రంగానికి కాగా, మిగిలినది అంటే రూ.2,000 కోట్లు వ్యవస్థీకృత రంగానిది. పరిశ్రమ ఏటా 15 శాతం వృద్ధి చెందుతోంది. మెట్రో నగరాల వాటా 40 శాతం.
ఈ నగరాల్లో ఒక్కో వినియోగదారు ఒకటికి మించి కళ్లజోళ్లను కొంటున్నారు. ఏడాది కాగానే మారుస్తున్నారట. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న టైటన్ ఐ ప్లస్, విజన్ ఎక్స్‌ప్రెస్, లెన్స్‌కార్ట్, జీకేబీ లెన్స్ వంటి చైన్లు 10 వరకూ ఉన్నాయి. ఒకటిరెండు రాష్ట్రాలకు పరిమితమైన చైన్లు 30 దాకా ఉన్నాయి. వైద్యులు, ఆప్టోమెట్రిస్టులు నిర్వహిస్తున్న కేంద్రాలు దేశంలో 20 వేల పైచిలుకు ఉంటాయని సమాచారం. టాప్ కంపెనీలు ఆన్‌లైన్‌కూ విస్తరించాయి.
Comments
Please login to add a commentAdd a comment