ఉత్తరాది మార్కెట్‌పై పెబ్స్ పెన్నార్ దృష్టి
రాజస్తాన్‌లో రూ. 60 కోట్లతో పీఈబీ యూనిట్ ఏర్పాటు..
- ఆ తర్వాత నెల్లూరులో మరో యూనిట్
- ఈ నెలాఖరులో ఐపీవోకి అనుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ (పీఈబీ) వ్యాపారంలో ఉన్న పెబ్స్ పెన్నార్... రచ్చగెలిచి తరవాత ఇంట గెలవాలని చూస్తోంది. ఉత్తరాది మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి సారించిన ఈ కంపెనీ దాదాపు రూ.60 కోట్ల పెట్టుబడితో రాజస్థాన్‌లో పీఈబీ యూనిట్‌ను ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది.
రవాణా, మెటీరియల్ ఖర్చుల వంటివి దృష్టిలో పెట్టుకుంటే హైదరాబాద్ యూనిట్ నుంచి క్లయింట్లకు పోటీ ధరకు ఇవ్వలేని పరిస్థితి ఉంది కనక ఉత్తరాదిలో ప్లాంటు ఏర్పాటు చేస్తే అలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ భావిస్తోంది. రాజస్థాన్ యూనిట్ కోసం స్థల సేకరణ తుది దశకు చేరుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే దీనిపై కంపెనీ ప్రతినిధులను సంప్రతించినపుడు మాత్రం వారు మాట్లాడటానికి నిరాకరించారు. ప్రస్తుతం పెబ్స్ పెన్నార్ పబ్లిక్ ఇష్యూకి రావడానికి సెబీకి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో తాము ఏ విషయంపైనా ఇపుడు మాట్లాడలేమని వారు స్పష్టంచేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు తొలుత దక్షిణాదిలో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావించినా, మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో కార్యకలాపాలు పెరగడంతో అక్కడే యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజస్థాన్ యూనిట్ పనులు పూర్తయిన తర్వాత తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేయటానికి వీలుగా ఆంధ్రప్రదేశ్‌లోని తడ వద్ద మరో యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కంపెనీ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం పెబ్స్ పెన్నార్‌కు మెదక్ జిల్లాలోని అంకపల్లి వద్ద ఏడాదికి 90,000 మెట్రిక్ టన్నుల యూనిట్లను తయారు చేసే సామర్థ్యం ఉంది.
త్వరలోనే ఐపీవోకి...
వచ్చే రెండు నెలల్లో పెబ్స్ పెన్నార్ ఐపీవోకి రాబోతోంది. ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ. 100 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ ఇప్పటికే సెబీకి దరఖాస్తు చేయగా... ఈ నెలాఖరులోగా అనుమతులు వచ్చే అవకాశముంది. ఈ ఇష్యూలో కొత్తగా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.58 కోట్లను కంపెనీ సమీకరిస్తుండగా, ఇప్పటికే ఇందులో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టిన పీఈ సంస్థ జెఫిర్ పీకాక్ ఈ ఇష్యూ ద్వారా మెజార్టీ వాటాను విక్రయించనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులతో కంపెనీకి ఉన్న రూ.35 కోట్ల అప్పులను తీర్చనుంది. ప్రస్తుతం పెబ్స్ పెన్నార్ టర్నోవరు రూ.400 కోట్ల మార్కును అధిగమించింది.