
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ నియామకాలు పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన నవంబర్‌లో 16 శాతం వృద్ధి నమోదయింది. నియామకాల పెరుగుదలకు నాన్–ఐటీ రంగం బాగా దోహదపడింది. రానున్న నెలల్లో కూడా నియామకాలపై అంచనాలు సానుకూలంగానే ఉన్నట్లు జాబ్ పోర్టల్ ‘నౌకరీ.కామ్’ తెలియజేసింది. జాబ్ మార్కెట్ రికవరీని సూచిస్తూ నవంబర్‌లో నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ 2,113 పాయింట్లకు చేరింది. ‘జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో 16 శాతం వృద్ధి నమోదయింది. దీనికి నాన్–ఐటీ రంగం ప్రధాన కారణం.
నిర్మాణం, ఇంజనీరింగ్, ఆటో, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ రంగాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదయ్యింది’ అని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. పరిశ్రమల వారీగా చూస్తే.. నిర్మాణ/ఇంజనీరింగ్ నియామకాల్లో 46 శాతం వృద్ధి, వాహన రంగ నియామకాల్లో 39 శాతం వృద్ధి కనిపించింది. ఇక హెవీ మిషనరీ, బ్యాంకింగ్ రంగాల్లో నియామకాలు వరుసగా 30 శాతం, 24 శాతం పెరిగాయి. ఎనిమిది మెట్రో నగరాలకు గానూ ఏడింటిలో నియామకాలు ఎగిశాయి. కోల్‌కతాలో 51 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 15 శాతం, ముంబైలో 16 శాతం వృద్ధి కనిపించింది. బెంగళూరులో మాత్రం 3 శాతం మేర క్షీణించాయి.
Comments
Please login to add a commentAdd a comment