కోటీ చేతికి పీ అండ్ జీ బ్రాండ్లు
న్యూయార్క్ : వినియోగ, కాస్మొటిక్ బ్రాండ్ల దిగ్గజం ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ దాదాపు 43 బ్యూటీ బ్రాండ్లను ‘కోటీ ఇన్‌కార్పొరేషన్’కు విక్రయిస్తోంది. 12.5 బిలియన్ డాలర్లకు ఈ బ్రాండ్లను విక్రయించడానికి వీరిద్దరి మధ్యా ఒప్పందం కుదిరినట్లు ఇరు కంపెనీలూ వెల్లడించాయి. ఈ కొనుగోలు ద్వారా కోటీ సంస్థ వార్షిక అమ్మకాలు ప్రస్తుతం ఉన్న 4.5 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు రెట్టింపై 10 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మెటిక్ కంపెనీల్లో ఒకటిగా కోటీ అవతరిస్తుంది. తాజా లావాదేవీ ప్రకా రం... పీ అండ్ జీ తొలుత తన 43 బ్రాండ్లనూ విడదీసి కొత్త కంపెనీగా ఏర్పాటు చేస్తుంది.
కోటీ ఒక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసి దాన్లో దీన్ని విలీనం చేసుకుంటుంది. ఒప్పందం మేరకు... హ్యూగో బాస్, గుక్కి, వంటి పెర్‌ఫ్యూమ్ బ్రాండ్లు, కవర్ గర్ల్, మాక్స్ ఫ్యాక్టర్ వంటి కాస్మెటిక్ బ్రాండ్లు, వెల్లా, క్లారియల్ వంటి హెయిర్ కలర్ బ్రాండ్లు కూడా కోటీ చేతికి వెళతాయి. కాగా అంత జోరుగా అమ్మకాల్లేని బ్రాండ్లను విడిచిపెట్టి, వినియోగ వస్తువుల వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించడానికి వీలుగా తాము ఈ అమ్మకం చేపట్టినట్లు పీ అండ్ జీ సీఈఓ ఎ.జి.లాఫ్లే చెప్పారు. గతేడాది పీ అండ్ జీ తన సబ్బు బ్రాండ్లు కెమే, జెస్ట్‌లను హెచ్‌యూఎల్‌కు విక్రయించింది. డ్యూరాసెల్ బ్యాటరీ వ్యాపారాన్ని బెర్క్‌షైర్ హాతవేకు, మెజారిటీ ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారాన్ని మార్స్ కార్పొరేషన్ కు విక్రయించింది. పీ అండ్ జీ అమెరికాలోని సిన్‌సినాటీ కేంద్రంగా పనిచేస్తుండగా.. న్యూ యార్క్ కేంద్రంగా కోటీ 1904లో ఏర్పాటైంది.