Procter & Gamble
-
పీఅండ్‌జీ విస్తరణ బాట
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్(పీఅండ్‌జీ) దేశీయంగా విస్తరణ బాట పట్టింది. దీనిలో భాగంగా గుజరాత్లో వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీకి కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా దేశీయంగా తొమ్మిదో ప్లాంటుకు తెరతీయనుంది. ఏరియల్, జిల్లెట్, హెడ్ అండ్ షోల్డర్స్, ఓరల్–బి, ప్యాంపర్స్, ప్యాంటీన్, టైడ్, విక్స్, విస్పర్ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లు కంపెనీ సొంతం. సణంద్ ప్రాంతంలోని 50,000 చదరపు మీటర్లలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక్కడ గ్లోబల్ హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియో నుంచి ఉత్పత్తులను రూపొందించనున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా డైజెస్టివ్స్ను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభంకానున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ప్రొడక్టులను విదేశాలకు ఎగుమతి చేసే కేంద్రంగా వినియోగించనున్నట్లు వివరించింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలకొద్దీ ఉద్యోగాల కల్పనకు వీలున్నట్లు తెలియజేసింది. గ్లోబల్ కంపెనీ ద్వారా దేశీయంగా ఎఫ్ఎంసీజీ విభాగంలో రెండో పెద్ద పెట్టుబడిగా ఇది నిలవనున్నట్లు పీఅండ్‌జీ ఇండియా సీఈవో ఎల్వీ వైద్యనాథన్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో సమావేశం సందర్భంగా వివరాలు వెల్లడించారు. గతేడాది సెపె్టంబర్లో మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్ఏ సైతం దేశీయంగా రూ. 5,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. 2015 నుంచి సణంద్‌లో పీఅండ్‌జీ తయారీ ప్లాంటును నిర్వహిస్తోంది. కొత్త ప్లాంటును అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా ఏర్పాటు చేయనుంది. -
బహుళజాతి కంపెనీలకు దేశీ దెబ్బ!
న్యూఢిల్లీ: హిందుస్థాన్ యూనీలీవర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, పెప్సీకో వంటి విదేశీ దిగ్గజాలకు దేశంలో ఎదురు దెబ్బ తగులుతోంది. వేగంగా విస్త రిస్తున్న దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు వీటికి గట్టిపోటీనిస్తున్నాయి. మెరుగ్గా రాణించి వాటి కంటే ఎక్కువ ఆదాయాలను రాబట్టుకుంటున్నాయి. 2015-16 సంవత్సరంలో దేశీయ ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆదాయాలు ఎంఎన్సీల కంటే ఎక్కువగా ఉన్నట్టు అసోచామ్ నివేదిక పేర్కొంది. దేశంలో ఎంపిక చేసిన 7 ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆదాయాలు గతేడాది 1,104.59 కోట్ల డాలర్లు (రూ.73,835 కోట్లు) కంటే అధికంగా ఉండగా.. అదే సమయంలో ఎంపిక చేసిన 7 ఎంఎన్సీల ఆదాయాలు 943.26 కోట్ల డాలర్లుగా (రూ.62,961 కోట్లు) ఉన్నాయి. దేశీ లిస్టెడ్ కంపెనీలివీ... దేశీయ ఎఫ్‌ఎంసీజీలలో ఐటీసీ లిమిటెడ్ 594.47 కోట్ల డాలర్ల మేర ఆదాయాలను నమోదు చేసింది. బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు 122.27 కోట్ల డాలర్లు, డాబర్ ఇండియా 88.46 కోట్లడాలర్లు, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 74 కోట్ల డాలర్లు, మారికో 76.11 కోట్ల డాలర్లు, అమూల్ 74.36 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇక, పతంజలి ఆయుర్వేద్ మిగిలిన అన్ని కంపెనీల కంటే వేగవంతమైన వృద్ధి (146 శాతం)తో 76.92 కోట్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక ఎంఎన్సీల విషయానికొస్తే... హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ ఆదాయం 492 కోట్ల డాలర్లుగా ఉంటే, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్‌కేర్ 38.2 కోట్ల డాలర్లు, గ్లాక్సోస్మిత్‌క్లయిన్ కన్జ్యూమర్ 66.2 కోట్ల డాలర్లు, కోల్గేట్ పామోలివ్ ఇండియా 64 కోట్ల డాలర్లు, గిల్లెట్ 32.16 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాయి. నెస్లే ఆదాయం 125.7 కోట్ల డాలర్లు, పెప్సికో ఇండియా ఆదాయం 125 కోట్ల డాలర్లుగా ఉంది. -
కోటీ చేతికి పీ అండ్ జీ బ్రాండ్లు
న్యూయార్క్ : వినియోగ, కాస్మొటిక్ బ్రాండ్ల దిగ్గజం ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ దాదాపు 43 బ్యూటీ బ్రాండ్లను ‘కోటీ ఇన్కార్పొరేషన్’కు విక్రయిస్తోంది. 12.5 బిలియన్ డాలర్లకు ఈ బ్రాండ్లను విక్రయించడానికి వీరిద్దరి మధ్యా ఒప్పందం కుదిరినట్లు ఇరు కంపెనీలూ వెల్లడించాయి. ఈ కొనుగోలు ద్వారా కోటీ సంస్థ వార్షిక అమ్మకాలు ప్రస్తుతం ఉన్న 4.5 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు రెట్టింపై 10 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మెటిక్ కంపెనీల్లో ఒకటిగా కోటీ అవతరిస్తుంది. తాజా లావాదేవీ ప్రకా రం... పీ అండ్ జీ తొలుత తన 43 బ్రాండ్లనూ విడదీసి కొత్త కంపెనీగా ఏర్పాటు చేస్తుంది. కోటీ ఒక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసి దాన్లో దీన్ని విలీనం చేసుకుంటుంది. ఒప్పందం మేరకు... హ్యూగో బాస్, గుక్కి, వంటి పెర్ఫ్యూమ్ బ్రాండ్లు, కవర్ గర్ల్, మాక్స్ ఫ్యాక్టర్ వంటి కాస్మెటిక్ బ్రాండ్లు, వెల్లా, క్లారియల్ వంటి హెయిర్ కలర్ బ్రాండ్లు కూడా కోటీ చేతికి వెళతాయి. కాగా అంత జోరుగా అమ్మకాల్లేని బ్రాండ్లను విడిచిపెట్టి, వినియోగ వస్తువుల వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించడానికి వీలుగా తాము ఈ అమ్మకం చేపట్టినట్లు పీ అండ్ జీ సీఈఓ ఎ.జి.లాఫ్లే చెప్పారు. గతేడాది పీ అండ్ జీ తన సబ్బు బ్రాండ్లు కెమే, జెస్ట్లను హెచ్‌యూఎల్‌కు విక్రయించింది. డ్యూరాసెల్ బ్యాటరీ వ్యాపారాన్ని బెర్క్‌షైర్ హాతవేకు, మెజారిటీ ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారాన్ని మార్స్ కార్పొరేషన్ కు విక్రయించింది. పీ అండ్ జీ అమెరికాలోని సిన్సినాటీ కేంద్రంగా పనిచేస్తుండగా.. న్యూ యార్క్ కేంద్రంగా కోటీ 1904లో ఏర్పాటైంది.