బహుళజాతి కంపెనీలకు దేశీ దెబ్బ!
న్యూఢిల్లీ: హిందుస్థాన్ యూనీలీవర్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, పెప్సీకో వంటి విదేశీ దిగ్గజాలకు దేశంలో ఎదురు దెబ్బ తగులుతోంది. వేగంగా విస్త రిస్తున్న దేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు వీటికి గట్టిపోటీనిస్తున్నాయి. మెరుగ్గా రాణించి వాటి కంటే ఎక్కువ ఆదాయాలను రాబట్టుకుంటున్నాయి. 2015-16 సంవత్సరంలో దేశీయ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆదాయాలు ఎంఎన్‌సీల కంటే ఎక్కువగా ఉన్నట్టు అసోచామ్ నివేదిక పేర్కొంది. దేశంలో ఎంపిక చేసిన 7 ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆదాయాలు గతేడాది 1,104.59 కోట్ల డాలర్లు (రూ.73,835 కోట్లు) కంటే అధికంగా ఉండగా.. అదే సమయంలో ఎంపిక చేసిన 7 ఎంఎన్‌సీల ఆదాయాలు 943.26 కోట్ల డాలర్లుగా (రూ.62,961 కోట్లు) ఉన్నాయి.
దేశీ లిస్టెడ్ కంపెనీలివీ...
దేశీయ ఎఫ్‌ఎంసీజీలలో ఐటీసీ లిమిటెడ్ 594.47 కోట్ల డాలర్ల మేర ఆదాయాలను నమోదు చేసింది.
బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు 122.27 కోట్ల డాలర్లు, డాబర్ ఇండియా 88.46 కోట్లడాలర్లు, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 74 కోట్ల డాలర్లు, మారికో 76.11 కోట్ల డాలర్లు, అమూల్ 74.36 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇక, పతంజలి ఆయుర్వేద్ మిగిలిన అన్ని కంపెనీల కంటే వేగవంతమైన వృద్ధి (146 శాతం)తో 76.92 కోట్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
ఇక ఎంఎన్‌సీల విషయానికొస్తే... హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ ఆదాయం 492 కోట్ల డాలర్లుగా ఉంటే, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్‌కేర్ 38.2 కోట్ల డాలర్లు, గ్లాక్సోస్మిత్‌క్లయిన్ కన్జ్యూమర్ 66.2 కోట్ల డాలర్లు, కోల్గేట్ పామోలివ్ ఇండియా 64 కోట్ల డాలర్లు, గిల్లెట్ 32.16 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాయి. నెస్లే ఆదాయం 125.7 కోట్ల డాలర్లు, పెప్సికో ఇండియా ఆదాయం 125 కోట్ల డాలర్లుగా ఉంది.