న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్(పీఅండ్‌జీ) దేశీయంగా విస్తరణ బాట పట్టింది. దీనిలో భాగంగా గుజరాత్‌లో వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీకి కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా దేశీయంగా తొమ్మిదో ప్లాంటుకు తెరతీయనుంది.
ఏరియల్, జిల్లెట్, హెడ్ అండ్ షోల్డర్స్, ఓరల్–బి, ప్యాంపర్స్, ప్యాంటీన్, టైడ్, విక్స్, విస్పర్ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లు కంపెనీ సొంతం. సణంద్ ప్రాంతంలోని 50,000 చదరపు మీటర్లలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక్కడ గ్లోబల్ హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియో నుంచి ఉత్పత్తులను రూపొందించనున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా డైజెస్టివ్స్‌ను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభంకానున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ప్రొడక్టులను విదేశాలకు ఎగుమతి చేసే కేంద్రంగా వినియోగించనున్నట్లు వివరించింది.
దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలకొద్దీ ఉద్యోగాల కల్పనకు వీలున్నట్లు తెలియజేసింది. గ్లోబల్ కంపెనీ ద్వారా దేశీయంగా ఎఫ్‌ఎంసీజీ విభాగంలో రెండో పెద్ద పెట్టుబడిగా ఇది నిలవనున్నట్లు పీఅండ్‌జీ ఇండియా సీఈవో ఎల్‌వీ వైద్యనాథన్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో సమావేశం సందర్భంగా వివరాలు వెల్లడించారు. గతేడాది సెపె్టంబర్‌లో మరో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్‌ఏ సైతం దేశీయంగా రూ. 5,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. 2015 నుంచి సణంద్‌లో పీఅండ్‌జీ తయారీ ప్లాంటును నిర్వహిస్తోంది. కొత్త ప్లాంటును అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా ఏర్పాటు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment