ఉద్యోగంలో చేరనందుకు రూ. 13 కోట్లు!
అదో అంతర్జాతీయ సౌందర్య సాధనాల కంపెనీ. పేరు కోటీ ఇన్కార్పొరేటెడ్. అడిడాస్, కాల్విన్ క్లీన్, ప్లేబోయ్ లాంటి బ్రాండులను ఆఫర్ చేస్తుంది. అయితే, తమ కంపెనీలో సీఈవోగా చేరకూడదని నిర్ణయించుకున్నందుకు ఎలియో లియోని సెటి అనే వ్యక్తికి దాదాపు రూ. 13 కోట్లు చెల్లిస్తోంది. ప్రస్తుతం ఇగ్లో గ్రూప్ అనే ఫ్రోజెన్ ఫుడ్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న సెటి.. ఈ 13 కోట్ల రూపాయలతో పాటు, అదనంగా మరో రూ. 32 లక్షల విలువైన షేర్లను కూడా పొందుతారు.
బార్ట్ బెష్ట్ తమ కంపెనీకి తాత్కాలిక సీఈవోగా ఉంటారని, ఆయన చైర్మన్గా కూడా కొనసాగాలని నిర్ణయించుకున్నారని కంపెనీ తెలిపింది. ఎలియో లియోని సెటి వాస్తవానికి జూలైలో సీఈవోగా చేరాలని భావించినా.. ఈ విషయం తెలిసిన వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారని, కోటీ సీఈవోగా ఆయన చేరట్లేదని కంపెనీ తెలిపింది. సెటి నిర్ణయాన్ని శ్లాఘించిన కోటీ కంపెనీ.. ఆయనను రూ. 13 కోట్లతో గౌరవిస్తోంది. మొత్తానికి ఉద్యోగంలో చేరనందుకు కూడా డబ్బులు వస్తాయని తెలిస్తే.. మనవాళ్లు ఊరుకుంటారా!