కొత్త ‘బంగారు’ భారత్! | PM Modi launches gold monetization scheme | Sakshi
Sakshi News home page

కొత్త ‘బంగారు’ భారత్!

Published Fri, Nov 6 2015 12:05 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

కొత్త ‘బంగారు’ భారత్! - Sakshi

కొత్త ‘బంగారు’ భారత్!

మూడు గోల్డ్ స్కీమ్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ..
 అశోక చక్ర చిహ్నంతో తొలి భారతీయ పసిడి నాణెం..
 అందుబాటులోకి పుత్తడి బాండ్లు, గోల్డ్ డిపాజిట్ పథకం
 

 న్యూఢిల్లీ: దీపావళి, ధన్‌తేరాస్‌లకు ముందే భారత్‌లో బంగారు కాంతులు విరజిమ్మాయి. మూడు కొంగొత్త పసిడి పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. దేశంలో నిరుపయోగంగా ఉన్న దాదాపు 20 వేల టన్నుల బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చే లక్ష్యంతో గోల్డ్ డిపాజిటల్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ప్రజలు ప్రత్యక్షంగా బంగారాన్ని కొనుగోలు చేయకుండా పేపర్ గోల్డ్‌ను ప్రోత్సహించేందుకు గోల్డ్ బాండ్‌లను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక తొలి భారతీయ బంగారు నాణేన్ని కూడా మోదీ ఆవిష్కరించారు. విదేశాల నుంచి బంగారం దిగుమతులను వీలైనంతమేరకు కట్టడి చేయడమే ఈ మూడు పథకాల ముఖ్యోద్దేశం. ప్రజలు ఈ స్కీమ్‌లలో పాలుపంచుకొని దేశాభివృద్ధికి తోడ్పాటునందించాలని మోదీ పిలుపునిచ్చారు. బంగారం అంటే సెంటిమెంట్‌గా భావించే దేశవాసులకు గోల్డ్ డిపాజిట్, బాండ్ల పథకాలు.. రెండిందాలుగా ప్రయోజనాన్ని అందిస్తాయని(సోనే పే సుహాగా) ప్రధాని పేర్కొన్నారు.
 
 పేద దేశమన్న ముద్రను చెరిపేయాలి...
 దేశవ్యాప్తంగా ఇళ్లు, గుళ్లు, వివిధ సంస్థల వద్ద ఎలాంటి ఉత్పాదకతకు నోచుకోని 20 వేల టన్నుల బంగారం ఉందని.. దీని ప్రకారం చూస్తే మనది పేద దేశం ఎలాఅవుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగా సరైన విధానాలు, చర్యలతో పేద దేశమన్న ముద్రను చెరిపేయొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. అశోక చక్ర చిహ్నంతో గోల్డ్ కాయిన్‌ను తీసుకురావడం భారత్‌కు గర్వకారణమని ఆయన అభివర్ణించారు. దీనివల్ల భారతీయులు విదేశాల్లో ముద్రించిన నాణేలు/బంగారంపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని కూడా ప్రధాని వివరించారు. మరోపక్క, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌కు కూడా ఈ ఇండియా గోల్డ్ కాయిన్ చేయూతగా నిలుస్తుందని మోదీ వివరించారు.
 
  ‘భారత్‌లో ప్రజలకు స్వర్ణకారులపై ఉన్న అచంచలమైన నమ్మకం, బంధం ఉంటుంది. ఇప్పుడు మేం ప్రవేశపెట్టిన పథకాలను వారు పూర్తిగా అందిపుచ్చుకోగలిగితే.. ఈ స్కీమ్‌లకు వాళ్లే అధిక మొత్తంలో ఏజెంట్లుగా మారేందుకు అవకాశం ఉంటుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.  భారతీయ మహిళల సంప్రదాయ పొదుపు, బంగారంపై వారికున్న మమకారం గురించి చెబుతూ... ‘పుత్తడి విషయంలో మహిళలను చైతన్యవంతం చేయాలంటే... ఆర్థిక శాస్త్రం, గృహ శాస్త్రం(ఇంటి ఆర్థిక నిర్వహణ) మధ్య తేడాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గుర్తించాలి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
 
 దిగుమతులను తగ్గించడం కోసమే: జైట్లీ
 దేశంలోకి బంగారం దిగుమతులను కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌తో ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తగ్గుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజలు బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం వల్ల దేశాభివృద్ధికి తమవంతుగా ఎలాంటి సహకారాన్ని అందించలేకపోతున్నారని కూడా జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ఏటా 1,000 టన్నుల బంగారం దిగుమతులతో ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి దిగుమతిదారుగా నిలుస్తోంది. ఇక ప్రజలు, గుళ్లు, వివిధ సంస్థల వద్ద 20 వేల టన్నులకు పైగానే బంగారం ఉంటుందని అంచనా. దీని విలువ రూ.52 లక్షల కోట్ల పైమాటే.
 
 పుత్తడి పథకాలతో ప్రయోజనమే...: డబ్ల్యూజీసీ
 ఈ కొత్త పసిడి స్కీమ్‌ల కారణంగా వినియోగదారులకు మరిన్ని  ఎంచుకునే అవకాశాలు లభిస్తాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) పేర్కొంది. భారత స్వర్ణపరిశ్రమ తీరు తెన్నులను ఈ పథకాలు మార్చివేస్తాయని డబ్ల్యూజీసీ ఎండీ పీఆర్ సోమసుందరం చెప్పారు.  నిరుపయోగంగా ఉన్న బంగారం ఈ స్కీమ్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తగినవిధంగా తోడ్పాటునందిస్తుందని వివరించారు. అయితే ఈ పథకాలు వినియోగదారుల ఆదరణ పొందడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. కాగా, వృద్ధి పుంజుకోవడానికి ఈ గోల్డ్ స్కీమ్‌లు దోహదం చేస్తాయని ఫిక్కీ అభిప్రాయపడింది.
 
 సావరీన్ గోల్డ్ బాండ్లు...
 ఈ స్కీమ్‌లో ఒక్కో వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 2 గ్రాముల నుంచి ఒకో గరిష్టంగా 500 గ్రాముల వరకూ బంగారాన్ని పేపర్ గోల్డ్(బాండ్స్) రూపంలో కొనుగోలు చేయొచ్చు. వీటిపై 2.75 శాతం వార్షిక వడ్డీరేట్లును ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది.  బంగారం ప్రత్యక్ష(ఫిజికల్‌గా) అమ్మకాలను తగ్గించడమే ఈ బాండ్‌ల జారీ ప్రధాన లక్ష్యం. తొలివిడత బాండ్‌ల జారీ ప్రక్రియ ఈ నెల 5 నుంచి 20 వరకూ జరుగుతుంది. ఈ నెల 26న కొనుగోలుదారులకు బాండ్‌లు జారీ అవుతాయి. నిర్ధేశిత బ్యాంకుల శాఖలు, పోస్టాఫీసుల్లో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో గ్రాముకు రూ.2,684 చొప్పున రేటును రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. అవసరమైతే ఐదేళ్ల తర్వాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అంతకంటే ముందే బాండ్ల నుంచి వైదొలగాలనుకునేవారి కోసం కమోడిటీ మార్కెట్లో ఈ బాండ్ల ట్రేడింగ్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇక ఫిజికల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్‌కు వర్తించేవిధంగానే ఈ బాండ్లను కొనుగోలుదారులకూ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. వడ్డీరాబడిపై ఆదాయపు పన్ను కూడా ఉంటుంది.
 
 గోల్డ్ డిపాజిట్ పథకం
 ఈ పథకం కింద బ్యాంకులు 15 ఏళ్ల వరకూ వివిధ కాలవ్యవధులతో ప్రజలు, సంస్థల వద్దనుంచి బంగారాన్ని డిపాజిట్ల రూపంలో స్వీకరిస్తాయి. 2.25 శాతం(మధ్యకాలిక డిపాజిట్లు), 2.5 శాతం(దీర్ఘకాలిక డిపాజిట్లకు) వార్షిక వడ్డీరేటు లభిస్తుంది. ఇక స్వల్పకాలిక డిపాజిట్లకు బ్యాంకులు వడ్డీరేటును నిర్ణయించే వెసులుబాటును కల్పించారు. 22 క్యారెట్ల స్వచ్ఛతగలిగిన కనీసం 30 గ్రాముల పసిడిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. ఈ స్కీమ్‌లో లభించే రాబడికి ఆదాయపు పన్ను. సందప పన్ను, మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. 1-3 ఏళ్ల స్వల్పకాల డిపాజిట్లను బ్యాంకులు స్వయంగా నిర్వహిస్తాయి. ఇక 5-7 ఏళ్ల మధ్యకాలిక డిపాజిట్లు, 12-15 ఏళ్ల దీర్ఘకాలిక డిపాజిట్లను ప్రభుత్వ డిపాజిట్ స్కీమ్‌లుగా పరిగణిస్తారు. దీనికి కస్టమర్లు నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. స్వల్పకాలిక డిపాజిట్లుగా స్వీకరించిన బంగారాన్ని బ్యాంకులు విక్రయించుకోవడానికి వీలుంది. లేదా ఇండియా గోల్డ్ కాయిన్లను ముద్రించే ఎంఎంటీసీకి, జువెల్లర్లకు లేదా ఈ స్కీమ్‌ను నిర్వహించే ఇతర బ్యాంకులకు రుణం రూపంలో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అనుమతిస్తోంది.
 
 గోల్డ్ కాయిన్ స్కీమ్..
 దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం సొంతంగా బాంగారు నాణేల విక్రయాలను ప్రారంభించింది. ఇండియా గోల్డ్ కాయిన్‌లో ఒకవైపు జాతీయ చిహ్నమైన అశోక చక్ర, మరోవైపు గాంధీ చిత్రాలను ముద్రించారు. 24 క్యారెట్ల స్వచ్ఛతతో తొలుత 5, 10 గ్రాముల చొప్పున నాణేలను అందుబాటులో ఉంచుతున్నామని, తర్వాత దశలో 20 గ్రాముల కడ్డీలు కూడా లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ రంగ ఎంఎంటీసీకి దేశవ్యాప్తంగా ఉన్న 125 పుత్తడి విక్రయ అవుట్‌లెట్లలో ఇవి లభిస్తాయని వెల్లడించింది. నకిలీలకు ఆస్కారం లేనివిధంగా బీఐఎస్ హాల్‌మార్కింగ్‌తో ఈ కాయిన్లను రూపొందిస్తున్నట్లు తెలిపింది. రానున్నరోజుల్లో నిర్ధేశిత బ్యాంక్ శాఖలు, పోస్టాఫీసుల్లో కూడా ఈ నాణేలను విక్రయించే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement