ప్రభుత్వ రుణం రూ.60.66 లక్షల కోట్లు
త్రైమాసికంగా 2 శాతం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ భారం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.60.60 లక్షల కోట్లుగా నమోదయ్యింది. త్రైమాసికంగా చూస్తే (2016 డిసెంబర్‌తో ముగిసిన కాలానికి) రుణ భారం 2 శాతం తగ్గింది. మొత్తం రుణంలో అంతర్గత వాటా 92.6 శాతం ఉంది. డిసెంబర్ ముగింపు త్రైమాసికంలో ఈ పరిమాణం 92.7 శాతం. పెట్టుబడులకు సంబంధించి భారత్ రేటింగ్ పెంచకపోవడానికి దేశ రుణ భారమే కారణమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజాలు తరచూ పేర్కొంటున్న సంగతి తెలిసిందే.
తగ్గిన భారం...:అంతర్గత రుణ భారం పరిమాణంలో చూస్తే– రూ.56.15 లక్షల కోట్లుగా ఉంది. 2017 మార్చి నాటికి జీడీపీలో ఇది 37.3 శాతంగా ఉంది. 2016 డిసెంబర్ నాటితో చూస్తే– జీడీపీలో ఇది 38.9 శాతం. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ దేశీయ స్థూల, నికర మార్కెట్ రుణ అవసరాలు వరుసగా రూ.5.82 లక్షల కోట్లు, రూ. 4.06 లక్షల కోట్లు ఉంటాయని అంచనావేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. గత ఏడాది ఈ మొత్తాలు వరుసగా రూ.5.85 లక్షల కోట్లు, రూ.4.40 లక్షల కోట్లుగా ఉన్నాయి.