
పీపీఎఫ్... మార్చుకోవటం ఈజీనే!
ఒక బ్యాంకు శాఖ నుంచి మరో శాఖకు మార్చుకోవచ్చు పోస్టాఫీసు నుంచి కూడా బ్యాంకుకు మార్చుకునే వీలు ఎక్కడి నుంచైనా క్లోజ్ చేసుకునే అవకాశం కొన్ని లాంఛనాలు పూర్తిచేస్తే చాలు
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్) ఎంతో మందికి చక్కని ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. పన్ను పోటు నుంచి తప్పించటమే కాకుండా మెరుగైన రాబడులు కూడా ఇస్తుంది. అందుకే వడ్డీ రేటు గతం కంటే తగ్గినా దీనిపట్ల ఉన్న ఆకర్షణ మాత్రం తగ్గటం లేదు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించడం సులువే. కానీ, ప్రారంభించిన తరవాత కావాల్సినపుడు నగదు వెనక్కి తీసుకునే విషయంలో చాలా మందికి పలు రకాల సందేహాలు వస్తుంటాయి. పైగా పోస్టాఫీసులో ఈ ఖాతాను ఆరంభించి ఉంటే... దాన్ని బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు కూడా. ఇందుకు సంబంధించి ఏమేం చేయాలనేది వివరించేదే ఈ కథనం...
పీపీఎఫ్ ఖాతాను ఏదైనా ప్రభుత్వరంగ బ్యాంకులో ప్రారంభించామనుకోండి. ఆ తరవాత వేరే ప్రాంతానికి మారిపోతే నగదు ఉపసంహరణకు తిరిగి ఖాతా ప్రారంభించిన దగ్గరకే వెళ్లాలా? ఖాతా క్లోజ్ చేయాలంటే ఎలా? ఇలాంటి సందర్భం ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది. కానీ, ఉన్న ప్రాంతం నుంచి ఖాతా తెరిచిన ప్రాంతం దూరంలో ఉంటే అక్కడి వరకూ వెళ్లిరావడం ప్రయాసతో కూడుకున్నదే. దీనికి బదులు ఖాతా క్లోజ్ చేసేసి ప్రస్తుతం ఉంటున్న చోట తెరిస్తే పోదూ..! అన్న ఆలోచన కూడా రావచ్చు. కానీ, బ్యాంకులో పీపీఎఫ్ ఖాతా తెరిస్తే నిజానికి ఇటువంటి ఇబ్బందులేవీ పడనక్కర్లేదు. ఖాతా ఎక్కడ ప్రారంభించామన్న దానితో సంబంధం లేకుండా ఏ పట్టణంలో ఉంటున్నా అక్కడి నుంచే ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు. లేదా నగదు ఉపసంహరించుకోవచ్చు. కాకపోతే ఇది కేవలం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రారంభించిన పీపీఎఫ్ ఖాతాలకే సాధ్యం. పోస్టాఫీసులో ఇలాంటి సదుపాయం లేదు. ఒకవేళ పోస్టాఫీసులో పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి ఉంటే దాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుకు బదిలీ చేసుకోవడమే పరిష్కారం.
పీపీఎఫ్ ఉపసంహరణకు...?
ముందుగా కేవైసీ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. పీపీఎఫ్ ఉపసంహరణకు వీలుగా ఫామ్ సీ, బ్యాంకు ఖాతాను తెలియజేసేందుకు కేన్సిల్డ్ చెక్, గుర్తింపు, నివాస చిరునామా ధ్రువీకరణ పత్రాలు, పీపీఎఫ్ పాస్ బుక్ ఉంటే దాన్ని కూడా జిరాక్స్ తీసి దగ్గర ఉంచుకోవాలి. ఈ పత్రాలపై బ్యాంకు అధికారుల ముందు సంతకం చేయాల్సి ఉంటుంది.
మీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్టు మేనేజర్‌కు తెలియజేయాలి. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన శాఖ మరో ప్రాంతంలో ఉందని, కనుక డాక్యుమెంట్లపై అటెస్టేషన్ చేయాలని కోరాలి. అప్పుడు ఆ డాక్యుమెంట్లపై తన సమక్షంలో సంతకం చేయాలని మేనేజర్ కోరతారు. మీరు సంతకం చేసిన తర్వాత మేనేజర్ దాన్ని ధ్రువీకరిస్తారు. ఆర్‌బీఐ సంబంధిత మేనేజర్‌కు జారీ చేసిన సిగ్నేచర్ కోడ్‌ను సంతకం పక్కన పేర్కొనాల్సి ఉంటుంది. ఒకవేళ మేనేజర్ అది పేర్కొనకపోతే అడిగి మరీ నమోదు చేయించుకోవాలి. దీంతో అటెస్టేషన్ పూర్తయినట్టు.
అటెస్టేషన్ చేయించిన పత్రాలన్నింటినీ రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా ఖాతా ప్రారంభించిన శాఖకు పంపాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అటెస్టేషన్ చేయించిన శాఖ సిబ్బంది తామే వాటిని మెయిన్ బ్రాంచ్‌కు పంపుతామని చెబితే... వారి నుంచి దరఖాస్తు, ఇతర కేవైసీ పత్రాలు ముట్టినట్టు రశీదు తీసుకోవాలి.
మీరు పంపిన పత్రాలన్నీ అసలు శాఖకు చేరిన తర్వాత వాళ్లు అన్నీ సక్రమంగా ఉంటే చెల్లింపుల ప్రక్రియను చేపడతారు. పీపీఎఫ్ మెచ్యూరిటీ నగదును నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా మీ బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. గతంలో పే ఆర్డర్లు ఇచ్చేవారు. ఇప్పుడు అనెఫ్ట్/ఆర్టీజీఎస్ విధానంలో ఖాతాలకు జమ చేస్తున్నారు.
ప్రజా భవిష్యనిధి ఖాతాను ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత ఖాతాలో ఉన్న బ్యాలన్స్‌పై కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నా పైన చెప్పుకున్న విధానాన్నే పాటించాల్సి ఉంటుంది.
ఒకవేళ పోస్టాఫీసులో పీపీఎఫ్ ఖాతాను తెరిస్తే... ఆ శాఖ నుంచే ఉపసంహరణ, క్లోజింగ్ సేవలు పొందాల్సి ఉంటుంది. లేదంటే ఆ ఖాతాను పోస్టాఫీసు నుంచి ఏదేనీ బ్యాంకుకు బదిలీ చేసుకోవడమే పరిష్కారం.
పీపీఎఫ్ ఖాతా అంటే సాధారణంగా ఎక్కువ మంది పోస్టాఫీసులో ప్రారంభించడమే మంచిదన్న భావనలో ఉంటారు. నిజానికి ఈ విధమైన అభిప్రాయం తప్పు. పోస్టాఫీసు అయినా, బ్యాంకు అయినా పీపీఎఫ్ ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. ఈ పథకాన్ని కేంద్రం నిర్వహిస్తుంది. సేవల పరంగా పోస్టాఫీసు లేక బ్యాంకు ఈ రెండింటిలో ఏది అనుకూలం అన్నది ఖాతాదారులు నిర్ణయించుకోవాలి. నిజానికి పోస్టాఫీసులో ఖాతా తెరిస్తే నెలవారీ చందాను ఆన్‌లైన్ విధానంలో జమ చేసుకునే వెసులుబాటు లేకపోవడం ప్రధాన అడ్డంకి గా చెప్పుకోవచ్చు.
ఒకవేళ పోస్టల్ బ్యాంకు మొదలైన తర్వాత ఈ విధమైన వెసులుబాటు వస్తుందేమో చూడాలి. అలాగే, పోస్టాఫీసులో పీపీఎఫ్ ఖాతాను తెరవడం వల్ల వేరే ప్రాంతానికి మారిపోతే ఉపసంహరణ సమయంలో తిరిగి అదే శాఖను వెతుక్కుంటూ వెళ్లాలి. ఈ విధమైన ఇబ్బందులు ఎందుకూ అనుకుంటే పోస్టాఫీసులో తెరిచిన పీపీఎఫ్ ఖాతాను బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు.
ఇందుకు ఏం చేయాలి..?
► ముందుగా పోస్టాఫీసుకు వెళ్లి పీపీఎఫ్ పాస్‌బుక్‌లో అప్ టు డేట్ అన్ని లావాదేవీల వివరాలను నమోదు చేయించుకోవాలి.
►తర్వాత పీపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ఫామ్ ఎస్‌బీ–10(బీ)ని పూర్తి చేయాలి.
► ఓ పేపర్‌పై పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసు నుంచి బ్యాంకు శాఖకు బదిలీ చేయాలని కోరుతూ దరఖాస్తు రాయాలి. ఎస్‌బీఐ ఖాతా ఉంటే పాస్‌బుక్ జిరాక్స్‌ను ఇచ్చినట్టయితే ప్రక్రియ వేగంగా నడుస్తుంది.
► పాన్, చిరునామా ధ్రువీకరణలను కూడా జత చేయాలి.
► వీటిని హెడ్ పోస్ట్ మాస్టర్‌కు అందించాలి. ఆయన పత్రాలన్నింటినీ పరిశీలించి దానిపై ఉన్న సంతకాన్ని తమ రికార్డుల్లో ఉన్న సంతకంతో పోల్చుకుంటారు. దాంతో వెరిఫికేషన్ ప్రక్రియ ముగుస్తుంది.
► అన్నీ సవ్యంగా ఉంటే పీపీఎఫ్ ఖాతాలో అప్పటి వరకు ఉన్న బ్యాలన్స్‌ను వెనక్కి ఇచ్చేసి పోస్ట్‌మాస్టర్ ఖాతాను మూసేస్తారు. పీపీఎఫ్ ఖాతాను ఎస్‌బీఐకి బదిలీ చేస్తున్నట్టు రిమార్క్ రాస్తారు.
► ఆ తర్వాత పీపీఎఫ్ ఖాతా బ్యాలన్స్, పత్రాలతో ఎస్‌బీఐ శాఖకు వెళ్లి ఆ మొతాన్ని చెక్ లేదా డ్రాఫ్ట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది.
► బ్యాంకు సిబ్బంది పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించి జమ చేసిన బ్యాలన్స్‌ను అందులో చూపిస్తారు. ఆ తర్వాత నుంచి పీపీఎఫ్ ఖాతా మనుగడలో ఉన్నట్టే.