
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త చైర్మన్‌గా రజనీష్ కుమార్ (59)నియమితులయ్యారు. ఈ నెల 7న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత చైర్‌ప ర్సన్ అరుంధతీ భట్టాచార్య పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానంలో రజనీష్ కుమార్‌ని నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) వెల్లడించింది.
రజనీష్ 2015 మే 26న ఎస్‌బీఐ బోర్డులో చేరారు. ప్రస్తుతం ఎస్‌బీఐ ఎండీగా ఉన్నారు. అంతకన్నా ముందు ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సీఈవో, ఎండీగాను వ్యవహరించారు. అలాగే బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ స్ట్రాటెజిక్ బిజినెస్ యూనిట్)గా కూడా సేవలు అందించారు. బ్రిటన్, కెనడా విభాగాల్లోనూ పలు కీలక హోదాల్లో పనిచేశారు. మొండి బకాయిల భారంతో బ్యాంకింగ్ రంగం సతమతమవుతున్న పరిస్థితుల్లో రజనీష్ కుమార్ ఎస్‌బీఐ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం 2017 మార్చి ఆఖరు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బాకీలు ఏకంగా రూ. 6.41 లక్షల కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది మార్చి ఆఖరు నాటికి వీటి పరిమాణం రూ. 5.02 లక్షల కోట్లు.
మరోవైపు, ప్రస్తుత చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తొలిసారిగా 2013లో బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఈ హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ నిరాటంకంగా సాగాలనే ఉద్దేశంతో గతేడాది అక్టోబర్‌లో ఆమె పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. 2017 ఏప్రిల్ 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనెర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌తో పాటు భారతీయ మహిళా బ్యాంకు కూడా ఎస్‌బీఐలో విలీనమైంది. 2016–17లో ఎస్‌బీఐ, గతంలో దాని అనుబంధ బ్యాంకులు రూ. 27,574 కోట్ల మేర నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏ) రైటాఫ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment