మందగమనమే... కానీ..? | RBI Growth Rate Rises Said Shaktikanta Das | Sakshi
Sakshi News home page

మందగమనమే... కానీ..?

Published Thu, Aug 8 2019 1:25 PM | Last Updated on Thu, Aug 8 2019 1:25 PM

RBI Growth Rate Rises Said Shaktikanta Das - Sakshi

ఆర్థిక రంగం మందగమన పరిస్థితుల్లో ఉందన్న పలువురు ప్రముఖుల ఆందోళనలను నిజం చేస్తూ... ఇది మందగమనమే కానీ, నిర్మాణాత్మక మందగమనం మాత్రం కాదన్నారు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌. వృద్ధి రేటు వేగాన్ని అందుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా వాహన విక్రయాలు క్షీణిస్తుండడం, వినిమయ డిమాండ్‌ తగ్గుతుండడం ఎంతో మందిని కలవరపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడానికి అవకాశం ఉందన్నారు దాస్‌. ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకునే చర్యలతో, తక్కువ బేస్‌ ప్రభావంతో   వృద్ధి రేటు తిరిగి వేగాన్ని సంతరించుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వృద్ధి రేటును పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకునే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. రంగాలవారీగా చర్యలు ఉంటాయన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనను గుర్తు చేశారు. 

పడిపోయిన డిమాండ్‌  
పెట్టుబడులు, డిమాండ్‌ రెండూ తగ్గాయని అంగీకరిస్తూ, ఇదే వృద్ధి రేటు పడిపోవడానికి దారితీస్తున్నట్టు దాస్‌ చెప్పారు. తాజా సమీక్షలో 6.9%కి జీడీపీ వృద్ధి అంచనాలు తగ్గించిన విషయం గమనార్హం. ‘‘ప్రస్తుతానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ దెబ్బతిన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు అమ్మకాలు క్షీణించడం, పట్టణ ప్రాంతాల్లో కార్ల విక్రయాలు పడిపోవడం ఇదే సూచిస్తోంది. అయితే, డిమాండ్‌ తిరిగి మెరుగుపడుతుందన్న ఆశాభావంతో ఆర్‌బీఐ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 7.5%కి చేరుతుంది’’ అని దాస్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ 1.10 శాతం మేర రేట్లను తగ్గించడం, వ్యవస్థలో సరిపడా లిక్విడిటీ ఉండేలా చూసేందుకు కట్టుబడి ఉండడం ఇందుకు సాయం చేస్తుందన్నారు.

రుణ పంపిణీ పెరుగుతుంది
‘‘రుణాల వితరణ అన్నది ప్రస్తుతం తిరిగి పుంజుకుంది. నేడు తీసుకున్న చర్యలతో వ్యవస్థలో రుణాల జారీని పెంచుతుంది. ఇది వృద్ధి గణాంకాలను పెంచేందుకు తోడ్పడుతుంది’’ అని శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. 

ఒక వంతే బ్యాంకులు బదిలీ చేశాయి
ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు స్థాయిలో బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయలేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అంగీకరించారు. జూన్‌ వరకు 75 బేసిస్‌ పాయింట్ల మేర ఆర్‌బీఐ తగ్గించగా, బ్యాంకులు కేవలం మూడింట ఒక వంతు 0.29 శాతాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేసినట్టు చెప్పారు. రేట్లను అధిక స్థాయిలోనే కొనసాగించేందుకు బ్యాంకులు జట్టు కట్టాయన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేశారు. బ్యాంకుల నుంచి అధిక రేట్ల తగ్గింపు బదలాయింపు అన్నది వారాలు, నెలల సమయం పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. తాము తీసుకున్న చర్యల ద్వారా వడ్డీ రేట్ల తగ్గింపు క్రమంగా వ్యవస్థలో కనిపిస్తుందని బ్యాంకులతో తాము నిర్వహించిన సమావేశం ఆధారంగా తెలుస్తోందన్నారు.

పాలసీలో ఇతర ముఖ్యాంశాలు..
నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌) 4 శాతం, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్‌) రేటు 5.65 శాతంగా ఉన్నాయి.  
2010 ఏప్రిల్‌ తర్వాత రెపో రేటు ఇంత తక్కువ స్థాయికి రావడం ఇదే తొలిసారి.  
ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఇద్దరు 25 బేసిస్‌ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, నలుగురు 35 బేసిస్‌ పాయింట్లకు మొగ్గు చూపారు.  
వినియోగధరల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ త్రైమాసికానికి 3.1 శాతంగా, ఆ తర్వాత రెండు త్రైమాసికాల్లో 3.5–3.7 శాతం మధ్య ఉండొచ్చని ఎంపీసీ అంచనా వేసింది. మొత్తం మీద 12 నెలల కాలానికి 4 శాతం లక్ష్యం పరిధిలోనే ద్రవ్యోల్బణం ఉంటుందని పేర్కొంది.
చెల్లింపుల మోసాల సమాచారాన్ని తెలియజేసేందుకు కేంద్రీకృత రిజిస్ట్రీ ఏర్పాటుకు నిర్ణయం. ఆర్థిక మోసాలు జరిగితే ఇది సత్వరమే స్పందిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement