
ఇంటికి కరెంటు బిల్లు అనేది రాకుండా ఉంటే సంతోషించని వాళ్లు ఉంటారా? అస్సలు ఉండరు. అది ఇల్లయినా, ఆఫీసు, కమర్షియల్ బిల్డింగ్స్ అయినా సరే! నిన్న మొన్నటి వరకూ ఇది ఎలా సాధ్యమబ్బా అనే అనుమానం ఉండేదిగానీ.. స్వీడన్ కంపెనీ ఒకటి చేస్తున ప్రతిపాదనతో ఇదీ సాధ్యమే అనిపిస్తోంది. ఎలాగంటారా? ఫొటోలో నిర్మాణమవుతున్న బిల్డింగ్ నేలను జాగ్రత్తగా గమనిస్తే.. వాటిపై కొన్ని పైపులు ఉన్న విషయం మీకు తెలుస్తుంది. అవేంటో తెలుసా... భవనంలోని కాంక్రీట్ దిమ్మెలు, స్లాబ్‌లు ఉంటాయి కదా.. అవి పరిసరాల్లోంచి సేకరించే వేడిని గ్రహించి ఇంకోచోటికి పంపే ఏర్పాట్లన్నమాట. ఇలాంటి హీట్ ఎక్సే్ఛంజర్లతోపాటు ఛిల్లర్‌లను వాడటం ద్వారా భవనంలో విద్యుత్తు వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చునన్నది ఈ స్వీడిష్ కంపెనీ ఇనెకో ఆలోచన.
ఈ ఏర్పాట్లు.. ఏసీ, చలిదేశాల్లోనైతే వెచ్చబెట్టేందుకు అవసరమైన విద్యుత్తులో దాదాపు 85 శాతాన్ని తగ్గిస్తాయని ఇనెకో సీఈవో జోనథన్ కార్లసన్ అంటున్నారు. అంతేకాదు, భవనం లోపలి ఉష్ణోగ్రతలు 22 డిగ్రీ సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంటాయట. ఇక మిగిలిన 15 శాతం విద్యుత్తును కూడా ఆదా చేసేందుకు ఈ కంపెనీ క్వాంటమ్ సోలార్ ప్యానెల్స్‌ను వాడింది. ఇనెకో ఇప్పటికే తమ విద్యుత్తు ఆదా వ్యవస్థను స్వీడన్‌తోపాటు చెకోస్లోవేకియా, స్పెయిన్, నెదర్లాండ్స్‌లలోని భవనాల్లో అమలు చేసింది కూడా. త్వరలోనే అమెరికా, టర్కీల్లోనూ తాము ఈ సృజనాత్మక టెక్నాలజీని అమలు చేయనున్నామని కార్ల్‌సన్ తెలిపారు. కొత్తగా కట్టే భవనాలకు మాత్రమే కాకుండా.. ఇప్పటికే కట్టేసిన వాటిల్లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చునని, సంప్రదాయ విద్యుత్తు వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు కూడా జరుగుతుందని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్

Comments
Please login to add a commentAdd a comment