భార్య నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్లతో ఏజీఎంకు వస్తున్న ముకేశ్
జనవరి 1 నుంచి రిలయన్స్ జియో వాణిజ్య సేవలు షురూ
• రూ.50కే 1జీబీ డేటా, ఉచితంగా వారుుస్ కాల్స్.. రోమింగ్
• ఈ నెల 5 నుంచి ప్రివ్యూ సేవలు.. నాలుగు నెలలు పూర్తిగా ఉచితం
• ఏజీఎంలో మొత్తం 10 రకాల టారిఫ్‌లను ప్రకటించిన అంబానీ
• 2017 డిసెంబర్ వరకూ రూ.15,000 విలువైన జియో యాప్స్ వాడకం ఫ్రీ
ముంబై: దేశీ టెలికం రంగంలో పెను సంచలనానికి రిలయన్‌స ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తెరతీశారు. రిలయన్‌స జియో పేరిట టెలికం సేవల్లోకి అరంగేట్రం చేస్తున్న ముకేశ్... ఉచితంగా వారుుస్ కాల్స్, దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్‌తో పాటు అత్యంత చౌక 4జీ డేటా టారిఫ్‌లతో ఇతర టెలికం కంపెనీల్లో వణుకు పుట్టించారు. కనీవినీఎరుగని ధర యుద్ధానికి దిగారు. గురువారం ఇక్కడ జరిగిన రిలయన్‌స ఇండస్ట్రీస్ 42వ వార్షిక వాటాదారుల సమావేశంలో (ఏజీఎం) జియో ప్రణాళికలను పూర్తి స్థారుులో ప్రకటించారు. ఈ నెల 5 నుంచి ప్రివ్యూ సేవలను తమ యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్ 31 వరకూ అంటే నాలుగు నెలలపాటు ఉచితంగా జియో సేవలన్నీ లభిస్తాయని చెప్పారు. వాణిజ్యపరంగా పూర్తిస్థారుు సేవలు మాత్రం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయని ముకేశ్ పేర్కొన్నారు. దాదాపు 90 నిమిషాల పాటు ఏజీఎంలో ప్రసంగించిన అంబానీ... ఇందులో 60 నిమిషాలు జీయోకి సంబంధించిన ప్రకటనలకే కేటారుుంచడం గమనార్హం. మొత్తంమీద దేశంలో మొబైల్ డేటా వినియోగం అంతకంతకూ ఎగబాకుతున్న నేపథ్యంలో ముకేశ్ అత్యంత చౌక టారిఫ్‌లతో రానున్న కాలంలో ‘డేటాగిరీ’ చేయనున్నారన్నది పరిశ్రమ విశ్లేషకుల అంచనా.
డేటాతో వారుుస్ కాల్స్ ఫ్రీ...
రిలయన్‌స జియో జనవరి 1 నుంచి ప్రారంభించే వాణిజ్య సేవలకు మొత్తం 10 రకాల డేటా ప్లాన్‌లను ప్రకటించింది. అప్పుడప్పుడూ డేటా(నెట్ సర్ఫింగ్) ఉపయోగించే యూజర్లకోసం రోజుకు కనిష్టంగా రూ.19 టారిఫ్ మొదలుకొని.. తక్కువగా డేటా వాడేవారికి నెలకు రూ.149 చొప్పున డేటా ప్యాకేజీని అందిస్తోంది. భారీస్థారుులో డేటా వినియోగించే యూజర్ల కోసం నెలకు రూ.4,999 ప్లాన్ కూడా ఉంది. ఇతర ప్లాన్‌లలో రూ.299; రూ.499, రూ.999; రూ.1,499; రూ.2,499; రూ.3,999 ఉన్నారుు. మొత్తంమీద ఈ ప్యాకేజీలన్నింటితో కూడా అపరిమిత వారుుస్ కాల్స్‌ను జియో ఆఫర్ చేస్తోంది.
‘‘కస్టమర్లు ఇకపై వారుుస్ లేదా డేటా సేవల్లో ఏదోఒకదానికి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రెండింటికీ అవసరం లేదు. ఇక వారుుస్‌కాల్స్‌కు కస్టమర్లు సొమ్ము చెల్లించే రోజులు పోరుునట్లే. జియో కస్టమర్లు వారుుస్ సేవలకు ఎన్నడూ చెల్లించాల్సిన అవసరం లేదు. మేం తీసుకొస్తున్న ప్యాకేజీలు మొత్తం టెలికం పరిశ్రమ స్వరూపానే మార్చేయనున్నారుు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్యాకేజీలతో దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ లభిస్తుందన్నారు. ప్రస్తుతం దేశీ టెలికం పరిశ్రమలో 22,000కు పైగా టారిఫ్‌లున్నాయని.. వీటన్నింటినీ జియో సరళీకరించిందని వెల్లడించారు.
ఎంత ఎక్కువ వాడితే అంత చౌక...
ఒక జీబీకి రూ.50 లేదా ఒక్కో ఎంబీకి 5 పైసలు మాత్రమే డేటా చార్జీ వసూలు చేస్తామని.. ప్రపంచంలోనే ఇది అత్యంత చౌక రేటని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. కస్టమర్లు ఎంత ఎక్కువ డేటా వాడితే అంత తక్కువ రేటుకు సేవలు అందుకోవచ్చని చెప్పారు. ‘ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డేటా ప్యాక్స్ ఒక్కో జీబీకి దాదాపు రూ.250 వరకూ వసూలు చేస్తున్నారుు. జియోతో ఇది 5-10 రెట్లు తక్కువకే లభిస్తుంది. మొత్తంమీద యూజర్లు వాడే డేటానుబట్టి ఒక జీబీ రూ.25-50కే లభిస్తుంది’ అని ఆయన వివరించారు. రూ.2,999 నుంచి జియో 4జీ ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయని ముకేశ్ చెప్పారు. రూ.15,000 విలువైన జియో యాప్స్ సబ్‌స్కిప్ష్రన్ వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకూ తమ జియో కస్టమర్లకు ఉచితంగా (కాంప్లిమెంటరీ) ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్...
ముకేశ్ అంబానీ జియో సేవలకు సంబంధించి విద్యార్థులకు ప్రత్యేక రారుుతీ ఆఫర్‌ను ప్రకటించారు. జియో ప్రధాన టారిఫ్‌లపై విద్యార్థులు అదనంగా 25 శాతం డేటాను వినియోగించుకోవచ్చని చెప్పారు. జియో అప్లికేషన్లను (యాప్స్) అన్‌లిమిటెడ్‌గా వాడుకునే అవకాశం, ఇంటర్నేషన్‌ల్ కాలింగ్‌కు అత్యంత తక్కువ రేట్లతో పాటు ఎంట్రప్రైజ్‌లకు (కంపెనీలు) ప్రత్యేక సొల్యూషన్‌స కూడా లభిస్తాయన్నారు. ఇక ‘జియో డిజిటల్ ఇండియా స్టార్టప్ ఫండ్’ను కూడా నెలకొల్పనున్నామని.. ప్రధానమైన నగరాల్లో ‘డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్’ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. దేశంలో వేలాది యువ ఎంట్రప్రెన్యూర్స్ తమ డిజిటల్ వెంచర్లను జియో ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించుకోవడానికి వారితో జట్టుకడతామని ముకేశ్ చెప్పారు.
పాత టెల్కోలపై విసుర్లు...
టెలికం రంగంలో పోటీ విషయంలో ఇప్పుడున్న టెలికం కంపెనీలపైనా ముకేశ్ గురిపెట్టారు. ‘పోటీ విషయంలో ఎవరైనా సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. అంతేకాని టెల్కోలు తమ మార్కెట్ పవర్‌ను దుర్వినియోగం చేసి ఇతర కంపెనీలకు అడ్డం కులు సృష్టించడం మంచిదికాదు. ఇంటర్‌కనెక్టివిటీ సమస్యలతో గతవారంలో జియో కస్టమర్లు 5 కోట్ల కాల్‌డ్రాప్‌లతో ఇబ్బందిపడ్డారు. ఇకనైనా ఎలాంటి జాప్యం లేకుండా జియో నెట్‌వర్క్‌తో ఇంటర్‌కనెక్టివిటీని కల్పించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ఇతర టెల్కోలకు ఉంది. అంతేకాకుండా మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) ఉపయోగించుకొని జియో నెట్‌వర్క్‌కు మారే హక్కు కస్టమర్లకు ఉంటుంది. దీన్ని టెల్కోలు అడ్డుకోరాదు. ’ అన్నారు.
ఆర్బిట్రేషన్‌పై వెనక్కితగ్గం...: ముకేశ్
కేజీ-బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తిపై ప్రభుత్వంతో తలెత్తిన వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) ప్రక్రియ నుంచి ఆర్‌ఐఎల్ వెనక్కితగ్గే ప్రసక్తే లేదని ముకేశ్ పేర్కొన్నారు. కేజీ-డీ6లో క్షేత్రాల్లో ఆర్‌ఐఎల్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాంట్రాక్టు ప్రకారం ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోవడంతో కేంద్రం భారీ మొత్తంలో జరిమానా(2.75 బిలియన్ డాలర్ల వ్యయాన్ని రికవరీ చేసుకోవడానికి అంగీకరించలేదు) విధించడం తెలిసిందే.
ఇప్పుడు ‘డేటాగిరి’ చేయాలి
భారతీయులుగా మనం ‘గాంధీగిరి’ని కొనియాడాలి, ప్రశంసించాలి. ఇప్పుడు అందరం ‘డేటాగిరి’ చేయాలి. అపరిమిత ఉచిత డేటాతో అపరిమిత మంచి పనులు చేయడానికి ఇదొక అవకాశం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం సాకారం కోసం జియో సేవలు తోడ్పడతారుు. ప్రపంచంలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్‌లో భారత్ 155 నుంచి ఏకంగా 10వ ర్యాంకుకు ఎగబాకుతుంది’ - ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధిపతి
10 కోట్ల మంది యూజర్లు లక్ష్యం...
సాధ్యమైనంత వేగంగా 10 కోట్ల మంది యూజర్లను జియో నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలన్నది తమ లక్ష్యంగా ముకేశ్ ప్రకటించారు. తద్వారా జియో టీమ్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. జియో నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 18,000 నగరాలు-పట్టణాలు, 2 లక్షలకు పైగా గ్రామాల్లో అందుబాటులోకి రానుంది. 2017 మార్చినాటికి దేశంలో 90 శాతం ప్రజలకు జియో సేవలు లభ్యమయ్యేలా చేయాలన్నది ముకేశ్ ప్రణాళిక. ‘జియో నెట్‌వర్క్‌ను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించాం.
5జీ, 6జీ టెక్నాలజీలు వచ్చినా మరింత డేటాకు సపోర్ట్ చేసేవిధంగా అప్‌గ్రేడ్ చేసుకోగలం’ అని ఆయన వివరించారు. సెకండ్‌కు ఒక గిగాబైట్ డేటా స్పీడ్‌ను జియో నెట్‌వర్క్ అందించగలదని ముకేశ్ హామీనిచ్చారు. జపాన్‌లో ఒక జీబీ డేటాకు 30 డాలర్లు, దక్షిణ కొరియాలో 18 డాలర్లు, చైనాలో 15 డాలర్లు, స్పెరుున్‌లో 7.5 డాలర్లు, దక్షిణాఫ్రికాలో 6 డాలర్లుగా ఉన్నాయని అంబానీ తెలియజేశారు. భారత్‌లో 3.5 డాలర్లుగా ఉండగా.. దీన్ని జియో 1 డాలరు(రూ. 67) లోపునకు తీసుకొస్తోందని చెప్పారు.
జియోపై ఎవరేమన్నారంటే...
దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ భారతీ ఎరుుర్‌టెల్... రిలయన్‌స జియో టెలికంకు స్వాగతం పలికింది. ‘డిజిటల్ వరల్డ్‌లోకి జియోను ఆహ్వానిస్తున్నాం. ఒక బాధ్యతగల టెల్కోగా నియంత్రణపరమైన అన్ని అంశాలనూ ఎల్లప్పుడూ మేం పాటిస్తాం’అని ఎరుుర్‌టెల్ పేర్కొంది. బీటా సేవల పేరుతో జియో పూర్తిస్థారుు సేవలను అందిస్తోందని, ఇష్టానుసారంగా డేటాను ఆఫర్‌చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతోందంటూ సెల్యులార్ ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ)ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై పాత టెల్కోలు జియోకు మధ్య వివాదం కొనసాగుతోంది. కాగా, వారుుస్, డేటా టారిఫ్‌లకు సంబంధించి జియో ప్రకటించిన టారిఫ్‌లు, రేట్లు కచ్చితంగా పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తుందని.. టెలికం విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దీన్ని ‘నాకౌట్ పంచ్’గా అభివర్ణిస్తున్నారు. ‘దేశీ టెలికం రంగం స్వరూపాన్ని మార్చేసే విధంగా(గేమ్ చేంజర్) జియో టారిఫ్‌లు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ ప్లాన్‌లతో ఆదాయం భారీగానే ప్రారంభమ్యే అవకాశం ఉన్నప్పటికీ.. నిర్వహణపరమైన బ్రేక్-ఈవెన్(లాభనష్టాలు లేని స్థారుు)ను జియో ఎప్పటికల్లా సాధిస్తుందన్నది ప్రధానంగా ఆందోళనకలిగించే అంశమని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ ధర్మేష్ కాంత్ అభిప్రాయపడ్డారు. ‘రిలయన్‌స జియో ఆఫర్ కస్టమర్లకు ప్రయోజనం అందిస్తుందని.. అరుుతే, ఈ టారిఫ్‌లతో ఇతర టెలికం కంపెనీలు పోటీలో లేకుండా పోతాయన్న వాదన సరికాదని సీఓఏఐ పేర్కొంది. జియో నెట్‌వర్క్‌లో ట్రాఫిక్ పెరిగిన తర్వాత మెరుగైన సేవల నాణ్యతను కొనసాగించడం ఆ కంపెనీకి అతిపెద్ద సవాలుగా నిలుస్తుందని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్.మథ్యూస్ అన్నారు.
టెలికం షేర్లు కుదేల్...
రిలయన్‌స జియో ప్రకటించిన అత్యంత చౌక టారిఫ్‌లు ప్రస్తుత టెలికం కంపెనీల షేర్లను కకావికలం చేశారుు. దేశీ స్టాక్ మార్కెట్లో లిస్టరుున ఉన్న భారతీ ఎరుుర్‌టెల్, ఐడియా, ఆర్‌కామ్ స్టాక్స్ కుదేలయ్యారుు. గురువారం ఒక్కరోజే లిస్టెడ్ టెల్కోల మార్కెట్ విలువ రూ.16,997 కోట్లు ఆవిరికావడం జియో ప్రకంపనలకు నిదర్శనం. ఐడియా సెల్యులార్‌షేరు ధర ఇంట్రాడేలో అత్యధికంగా 11 శాతం దిగజారి 52 వారాల కనిష్టానికి(రూ.83.20) పడిపోరుుంది. చివరకు 10.48 శాతం నష్టంతో రూ.83.70 వద్ద ముగిసింది. ఇక భారతీ ఎరుుర్‌టెల్ షేరు కూడా 9 శాతం కుప్పకూలి చివరకు 6.4 శాతం క్షీణతతో రూ.311 వద్ద స్థిరపడింది. మరోపక్క, ఆర్‌కామ్ షేరు 10.11 శాతం వరకూ క్షీణించింది. తుదకు 8.8 శాతం నష్టంతో 49.15 వద్ద ముగిసింది. ఇక టాటా టెలీసర్వీసెస్(మహారాష్ట్ర) 2.83 శాతం పడి రూ.6.19 వద్ద క్లోజైంది. బీఎస్‌ఈ టెలికం ఇండెక్స్ 5.67 శాతం పడిపోరుుంది.