రిలయన్స్‌ జియో...మరో బంపర్‌ ఆఫర్‌! | Reliance Jio to start charging for data, price war to continue | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియో...మరో బంపర్‌ ఆఫర్‌!

Published Wed, Feb 22 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

రిలయన్స్‌ జియో...మరో బంపర్‌ ఆఫర్‌!

రిలయన్స్‌ జియో...మరో బంపర్‌ ఆఫర్‌!

ప్రస్తుత యూజర్లకు రూ. 99తో వార్షిక సభ్యత్వం
నెలకు 30 జీబీ డేట@రూ.303  
ఏప్రిల్‌ 1 నుంచి డేటాకు చార్జీలు షురూ
170 రోజుల్లో 10 కోట్ల కస్టమర్లు
రిలయన్స్‌ జియో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ


న్యూఢిల్లీ:  ప్రమోషనల్‌ ఆఫర్ల కింద ఇప్పటిదాకా ఉచితంగా లభిస్తున్న రిలయన్స్‌ జియో డేటా సర్వీసులకు ఏప్రిల్‌ 1 నుంచి చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ మరో బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుత యూజర్లు మాత్రం వన్‌ టైమ్‌ జాయినింగ్‌ ఫీజు కింద రూ. 99 కడితే నెలకు రూ. 303 టారిఫ్‌తో ప్రస్తుత ఉచిత ప్రయోజనాలను మరో 12 నెలల పాటు పొందవచ్చు. రిలయన్స్‌ జియో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మంగళవారం ఈ విషయాలు వెల్లడించారు. జియో సర్వీసులు ప్రారంభించిన తర్వాత 170 రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్ల మైలురాయిని అధిగమించినట్లు ఆయన చెప్పారు.

‘సెప్టెంబర్‌ 5న జియో సేవలు ప్రారంభించాం. 170 రోజుల తర్వాత నేడు జియో 4జీ ఎల్‌టీఈ, ఐపీ వైర్‌లెస్‌ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌లో 10 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారు‘ అని అంబానీ పేర్కొన్నారు. హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ పేరిట జియో అందిస్తున్న ప్రమోషనల్‌ ఆఫర్‌ ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే అటుపై వర్తించబోయే టారిఫ్‌ల గురించి ముకేశ్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు దశాబ్దం తర్వాత టెలికం వ్యాపారంలోకి అడుగుపెట్టిన ముకేశ్‌ అంబానీ.. ఉచిత డేటా, వాయిస్‌ ప్లాన్లతో దేశీ టెలికం పరిశ్రమను కుదిపేశారు. జియో ఆఫర్లకు దీటుగా మిగతా టెల్కోలు టారిఫ్‌లు భారీగా తగ్గించాల్సి వచ్చింది. దీంతో పోటీ మార్కెట్లో టెలికం కంపెనీల విలీనాల ప్రతిపాదనలు కూడా తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే.

టారిఫ్‌లపై..: ఏప్రిల్‌ 1 నుంచి టారిఫ్‌లు అమల్లోకి వచ్చినా కూడా ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్‌ కాల్స్‌ (ఎస్‌టీడీ సహా), దేశవ్యాప్త రోమింగ్‌ ఉచితంగానే కొనసాగనున్నట్లు ముకేశ్‌ వివరించారు. ఇక డేటా విషయానికొస్తే.. మిగతా టెల్కోల అత్యధిక టారిఫ్‌లను మించిన సర్వీసులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇతర టెలికం ఆపరేటర్లు అందిస్తున్న ప్లాన్స్‌ కన్నా తాము 20 శాతం అధిక డేటాను అందిస్తామని ముకేశ్‌ వివరించారు. ప్రస్తుత 10 కోట్ల మంది యూజర్లకోసం జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను ప్రకటించారాయన.

వన్‌ టైమ్‌ ఫీజు కింద రూ. 99 కట్టి యూజర్లు ఇందులో సభ్యత్వం పొందవచ్చన్నారు. వీరికి 2018 మార్చి 31 దాకా అతి తక్కువగా నెలకు రూ. 303 చార్జీతో ప్రస్తుత ప్రయోజనాలు కొనసాగుతాయని ముకేశ్‌ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి దేశంలోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోకి నెట్‌వర్క్‌ విస్తరించనున్నట్లు, దాదాపు 99 శాతం మంది జనాభాకు చేరువ కానున్నట్లు ఆయన చెప్పారు.

సెకనుకు ఏడుగురు యూజర్లు ..
జియో నెట్‌వర్క్‌లో 200 కోట్ల నిమిషాల పైగా వాయిస్, వీడియో కాల్స్‌..100 కోట్ల పైగా జీబీ డేటా వినియోగం జరిగిందని ముకేశ్‌ చెప్పారు. తద్వారా మొబైల్‌ డేటా వినియోగంలో భారత్‌ అగ్రస్థానంలో నిల్చిందని ఆయన వివరించారు. జియోలో డేటా వినియోగం.. అమెరికాలో వినియోగానికి సరిసమానంగా ఉందన్నారు. ‘170 రోజుల్లో నిత్యం సగటున సెకనుకు ఏడుగురు కస్టమర్లు మా నెట్‌వర్క్‌లో చేరారు. ప్రపంచంలోనే ఏ టెక్నాలజీ కంపెనీకి కూడా ఈ స్థాయిలో ఆదరణ దక్కలేదు.

ఇక, జియో నెట్‌వర్క్‌లో ప్రతి రోజూ దాదాపు 5.5 కోట్ల గంటల మేర వీడియోల వీక్షణ రూపంలో డేటా వినియోగం జరుగుతోంది. ఆ రకంగా అంతర్జాతీయంగా అతి పెద్ద మొబైల్‌ వీడియో నెట్‌వర్క్‌లలో ఒకటిగా జియో నిలుస్తోంది‘ అని ముకేశ్‌ తెలిపారు. దేశీయంగా టెల్కోలన్నింటికన్నా రెట్టింపు స్థాయిలో తమకు 4జీ బేస్‌ స్టేషన్స్‌ ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టంగాను, వేగవంతంగానూ తీర్చిదిద్దుకోనున్నట్లు ఆయన చెప్పారు.

జియో టారిఫ్‌లతో టెల్కోల ఊరట..
రిలయన్స్‌ జియో సర్వీసులకు టారిఫ్‌లను నిర్ణయించడం పరిశ్రమకు మంచిదేనని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ తెలిపారు. జియో ప్రకటించిన చార్జీలు కాస్త దూకుడుగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. సాధ్యపడని టారిఫ్‌లు కావని చెప్పారు. ప్రస్తుతం సుమారు రూ. 180గా ఉంటున్న ఏఆర్‌పీయూ (యూజర్‌పై సగటు ఆదాయం)ని రూ. 300కి పెంచగలిగిన పక్షంలో రూ. 303 (అదనంగా రూ. 99) చార్జీ తీసిపారేయతగ్గదేమీ కాదని మాథ్యూస్‌ పేర్కొన్నారు.

ప్రైమ్‌ ప్లాన్‌ ఇలా..
ఈ ఏడాది మార్చి 31లోగా రిలయన్స్‌ జియో కనెక్షన్‌ తీసుకున్నవారు రూ. 99 వన్‌ టైమ్‌ ఫీజు కింద, అటు పైన నెలకు రూ. 303 చెల్లిస్తే.. ప్రస్తుతం అమలవుతున్న హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ ప్రయోజనాలు మరో ఏడాది పాటు పొందవచ్చు. అంటే రోజుకు దాదాపు రూ. 10 చొప్పున చార్జీలు కట్టినట్లవుతుంది. దీనితో జియో యాప్స్‌ ప్యాకేజీలోని మీడియా, కంటెంట్‌ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అయితే, అపరిమిత డేటా అయినప్పటికీ.. ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ కింద రోజుకు 1 జీబీ పరిమితి ఉంటుంది. మొత్తం మీద ప్రైమ్‌ ప్లాన్‌ ప్రయోజనాల విలువ దాదాపు రూ. 10,000 దాకా ఉండవచ్చని అంచనా. ఒకవేళ యూజరు జియో ప్రైమ్‌ గానీ ఎంచుకోని పక్షంలో .. సాధారణ పోస్ట్‌పెయిడ్‌ లేదా ప్రీపెయిడ్‌ ప్లాన్‌కి మారవచ్చు. తదనుగుణంగా డేటా, ఇతర సర్వీసులకు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. వాయిస్‌ కాల్స్‌కి మాత్రం (రోమింగ్‌ సహా) మినహాయింపు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement