ముంబై: ‘రిలయన్స్ ట్రెండ్స్’ భారీ విస్తరణకు రిలయన్స్ రిటైల్ సిద్ధమైంది. ప్రస్తుతం 557గా ఉన్న ఔట్‌లెట్లను వచ్చే ఐదేళ్లలో 2,500కు పెంచాలని, ఈ కామర్స్‌తోనూ అనుసంధానించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిసింది. కొత్త ఈ కామర్స్ విధానం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు ప్రతికూలంగా ఉండటంతో... ఈ కామర్స్ విభాగంలో ఫ్యాషన్ పరంగా విస్తరించేందుకు ఇది అనుకూల సమయమని రిలయన్స్ భావిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ–కామర్స్ సంస్థలు తమకు వాటాలున్న కంపెనీల నుంచి విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధించింది. తమ ద్వారానే విక్రయించేలా వెండర్లతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోవడాన్ని నిషేధించింది. దీంతో రిలయన్స్ రిటైల్ ఈ కామర్స్ విభాగంలో భారీగా చొచ్చుకుపోయేందుకు ఇదే అనుకూల తరుణమని భావిస్తోంది.
300 పట్టణాలే లక్ష్యం...
ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 300 పట్టణాల్లో రిలయన్స్ ట్రెండ్స్ దుకాణాలను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ప్రణాళికగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 160 పట్టణాల్లో రిలయన్స్ ట్రెండ్స్ సేవలున్నాయి. రిటైల్‌పై ముకేశ్ అంబానీ అంచనాలు పెరిగాయని, కంపెనీ తన ప్రణాణళికలను రిటైల్ అడ్వైజర్లతో పంచుకుందని వెల్లడించాయి. అయితే, దీనిపై రిలయన్స్ రిటైల్ స్పందించలేదు. రిలయన్స్ ట్రెండ్స్ విస్తరణ ద్వారా తన ప్రైవేటు లేబుల్ (సొంత బ్రాండ్) ఉత్పత్తుల అమ్మకాలను వేగంగా పెంచుకోవాలన్నది ప్రణాళిక. ఈ కామర్స్ వెంచర్‌లో తన ప్రైవేటు లేబుల్ ఉత్పత్తుల లభ్యతను పెంచడం, చిన్న పట్టణాలకు కూడా విస్తరించడం రిలయన్స్ ట్రెండ్స్ తదుపరి వృద్ధి చోదకంగా రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. గత ఏడాది 100 రిలయన్స్ ట్రెండ్స్ స్టోర్లను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. మన దేశంలో 18–35 ఏళ్ల వయసు గ్రూపు వారు 44 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో యువ జనాభా మన దగ్గరే ఎక్కువ. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతుండటంతో ఈ కామర్స్ సంస్థలు తగ్గింపు ఆఫర్లతో కస్టమర్లను ఆన్‌లైన్ షాపింగ్ దిశగా ఆకర్షిస్తున్నాయి.
యువతరాన్ని ఆకర్షించడానికే ప్రతి రిటైలర్ చూస్తారని, రిలయన్స్ కూడా ఇందుకు భిన్నమేమీ కాదని రిటైల్ రంగ ప్రముఖుడొకరు పేర్కొన్నారు. రిటైలర్లకు థర్డ్‌పార్టీ ఉత్పత్తులతో పోలిస్తే తమ సొంత బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలపై ఎక్కువ మార్జిన్ మిగులుతుంది. రిలయన్స్ రిటైల్ వేగవంతమైన విస్తరణ ప్రణాళిక అనేది ప్రైవేటు లేబుల్ ఉత్పత్తులు మల్టీబ్రాండ్ ఔట్‌లెట్లు, చిన్న ఫార్మాట్ దుకాణాల్లోనూ లభించేలా ఉంటుందని రిటైల్ కన్సల్టెంట్ గోవింద్ శ్రీఖండే తెలిపారు. రిలయన్స్ ట్రెండ్స్ ఆదాయంలో 80 శాతం ప్రైవేటు లేబుల్ ద్వారానే వస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాలు, లండన్‌లోని మరో కేంద్రంలో ఉన్న డిజైనర్ల బృందాలు జీన్స్, ట్రోజర్స్, షర్ట్‌లు, టీ షర్ట్‌లను డిజైన్ చేస్తుంటారని కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
రిలయన్స్ ట్రెండ్స్ భారీ విస్తరణ!
Published Sat, Mar 9 2019 12:10 AM | Last Updated on Sat, Mar 9 2019 12:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment