ఎఫ్ డీసీ ఔషధాల నిషేధంపై ఫార్మా సంస్థలకు ఊరట
మార్చి 21 దాకా స్టే ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: కొన్ని ఫిక్సిడ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాల నిషేధం అంశంలో ఫార్మా సంస్థలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. నిషేధాజ్ఞలపై న్యాయస్థానం మార్చి 21 దాకా స్టే ఇచ్చింది. దీంతో పీఅండ్‌జీకి చెందిన విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా, రెకిట్ బెన్‌కిసర్ ఉత్పత్తి డీకోల్డ్, పిరమాల్‌కి చెందిన సారిడాన్ తదితర ఉత్పత్తులపై 21 దాకా నిషేధం వర్తించదు. సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న కారణంతో నిర్దిష్ట కాంబినేషన్‌లోని 300 పైగా ఔషధాలను కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా ట్యాబ్లెట్లు మొదలుకుని ఆస్కోరిల్ దగ్గు మందులు, క్యాండిడ్ ఇయర్ డ్రాప్స్ మొదలైనవి ఉన్నాయి. దీంతో నిషేధాజ్ఞలను సవాల్ చేస్తూ ఫైజర్, అబాట్ హెల్త్‌కేర్, మెక్లియోడ్స్ ఫార్మా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, గ్లెన్‌మార్క్, రెకిట్ బెన్‌కిసర్ మొదలైన సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి.