జియో నుంచి ధన్ ధనాధన్ ఆఫర్ ఇదే!
ట్రాయ్ ఆదేశాల మేరకు సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ఉపసంహరించుకోవడంతో రిలయన్స్ జియో ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. రూ. 309తో రీచార్జి చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా లిమిట్‌తో 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 84 రోజులు అంటే నెలకు 28 రోజుల చొప్పున 3 నెలలు అన్నమాట. ఇందులో దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. అదే రోజుకు 2 జీబీ డేటా కావాలనుకుంటే అదే 84 రోజులకు రూ. 509తో రీచార్జి చేసుకోవాలి. ఈ రెండు ప్లాన్లు జియో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే పరిమితం. నాన్ ప్రైమ్ యూజర్లయితే రోజుకు 1 జీబీ డేటా చొప్పున 84 రోజులకు రూ. 408 పడుతుంది. 2 జీబీ కావాలంటే వాళ్లు రూ. 608 చెల్లించాలి.
ఇంతకుముందున్న సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ స్థానంలో ఈ ధన్ ధనాధన్ ఆఫర్ వచ్చినట్లు జియో ప్రకటించింది. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ తమ రెగ్యులేటరీ పరిధిలోకి రాదని, అందువల్ల దాన్ని వెంటనే ఆపాలని ట్రాయ్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15వ తేదీలోగా రూ. 303తో రీచార్జి చేసుకుంటే మూడు నెలలకు పైగా ప్రయోజనాలు ఉండేలా సమ‍్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను రూపొందించారు. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కావాలంటే ఒక్కసారి రూ. 99 ఫీజు కట్టాల్సి ఉంటుందని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేష్ అంబానీ ఫిబ్రవరిలో ప్రకటించారు. ఏడాది పాటు పలు రకాల డేటా ప్యాక్‌లను ఎంచుకునే అవకాశం ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న సభ్యులకు ఉంటుంది.