బ్రాండ్ ఇండియా కోసం ఫార్మా ట్రస్ట్ | Responsible Healthcare Trust starts in next month | Sakshi
Sakshi News home page

బ్రాండ్ ఇండియా కోసం ఫార్మా ట్రస్ట్

Published Sat, Sep 20 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

బ్రాండ్ ఇండియా కోసం ఫార్మా ట్రస్ట్

బ్రాండ్ ఇండియా కోసం ఫార్మా ట్రస్ట్

* రెస్పాన్సిబుల్ ఇండియా ట్రస్ట్వచ్చే నెలలో ప్రారంభం..
* ప్రభుత్వానికి 60 శాతం, ఫార్మా కంపెనీలకు 40 శాతం వాటా...
* కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వెల్లడి

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ఇండియన్ ఫార్మాపై వస్తున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి కేంద్రం నడుంబిగించింది. ఇందుకోసం ఫార్మా కంపెనీల భాగస్వామ్యంతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రెస్పాన్సబుల్ హెల్త్‌కేర్ ట్రస్ట్ (ఆర్‌హెచ్‌టీ) ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెలలో ఈ ట్రస్ట్‌ను రిజిస్టర్ చేస్తామని, బ్రాండ్ ఇండియా బిల్డింగ్‌పై ఇది ప్రధానంగా దృష్టిసారిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ తెలిపారు.
 
ఫార్మెక్సిల్ 10 వార్షిక సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశీయ ఔషధాల నాణ్యత, జనరిక్ ఔషధాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న దుష్ర్పచారాన్ని  అరికట్టడానికి ఫార్మా కంపెనీలతో కలసి ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మన మందులపై  దక్షిణాఫ్రికా, వియత్నాంలలో ఈ విధంగానే అసత్య ప్రచారం జరిగిందని, ఇక నుంచి ఇలాంటి సంఘటనలు వెలుగు చూడగానే వాటికి అడ్డుకట్టవేయడమే ఆర్‌హెచ్‌టీ ప్రధాన కర్తవ్యం అన్నారు.
 
కేంద్రం 60 శాతం, ఫార్మా కంపెనీలు 40 శాతం వాటాతో 11 మంది సభ్యులతో ఈ ట్రస్ట్ ఏర్పడుతోంది. ప్రస్తుతం దేశీయ ఫార్మా నాణ్యత, బ్రాండింగ్, మానవ వనరుల లభ్యత వంటి అంశాల్లో సమస్యలు ఎదుర్కొంటోందని రాజీవ్ ఖేర్ పేర్కొన్నారు.
 
ఏక లక్ష్యంతోనే లీడర్...
వ్యాపారంలో కాని, మరే అంశంలోనైనా ఒకే అంశంపై దృష్టిసారించి ముందుకు కొనసాగితే ఎప్పటికైనా లీడర్ స్థాయికి ఎదుగుతారని అరబిందో ఫార్మా  ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి పి.వి తెలిపారు. ఫార్మెక్సిల్ సీఈవో కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఒకేసారి అన్ని విషయాలపై దృష్టిసారించే కంటే ఏక లక్ష్యంతో పనిచేస్తే తొందరగా విజయాన్ని చేరుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ మాట్లాడుతూ పేటెంట్ హక్కులు ముగిసే సమయం కంటే ఏనిమిదేళ్ల ముందుగానే జనరిక్ పరిశోధనలు మొదలు పెడితే కాని అవకాశాలు అందిపుచ్చుకోలేమన్నారు.
 
ఈ కార్యక్రమంలో జైడస్ క్యాడిలా సీఎండీ పంకజ్ పటేల్, నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని, సువెన్‌లైఫ్ చైర్మన్ వెంకట్ జాస్తి తదితర ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ఫార్మా ఎగుమతులు, పేటెంట్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి ఫార్మెక్సిల్ అవార్డులను ప్రదానం చేసింది. అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన కంపెనీగా లుపిన్ ఫార్మా, బల్క్ డ్రగ్స్‌లో అరబిందో ఫార్మా అవార్డులను గెలుచుకున్నాయి.

Advertisement

పోల్

Advertisement