యూఎస్‌వో నిధుల మళ్లింపుపై కాగ్ ఆక్షేపణ
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక టెలిఫోన్ సర్వీసులు అందించేందుకు ఉద్దేశించిన యూఎస్‌వో ఫండ్ నుంచి రూ. 33,683 కోట్ల నిధులను ఇతరత్రా అవసరాలకు మళ్లించడం జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఒక నివేదికలో పేర్కొంది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌వో)కి సంబంధించి 2002-03 నుంచి 2013-14 మధ్య కాలంలో యూనివర్సల్ యాక్సెల్ లెవీ (యూఏఎల్) కింద రూ. 58,579 కోట్ల మేర వచ్చినట్లు కాగ్ తెలిపింది.
సాధారణంగా ఈ నిధులు ముందుగా కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమవుతాయి. ఆ తర్వాత కేంద్రం విడతల వారీగా నిధులను యూఎస్‌వో ఫండ్‌లోకి జమ చేస్తుంది. అయితే, ఇందులో రూ. 24,896 కోట్లు మాత్రమే సబ్సిడీ కింద విడుదలయ్యాయని, మిగతా రూ. 33,683 కోట్లు యూఎస్‌వో నిధికి బదలాయించడం జరగలేదని కాగ్ పేర్కొంది. ఈ నిధులను ఉద్దేశించిన లక్ష్యాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడం జరిగిందని పార్లమెంటుకి సమర్పించిన నివేదికలో కాగ్ పేర్కొంది. దీనిపై టెలికం శాఖ ఇచ్చిన వివరణ ఆమోదయోగ్యంగా కనిపించలేదని తెలిపింది.