సాక్షి, న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల భారీ హవాలా రాకెట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. అంతర్జాతీయ హవాలా రాకెట్ విలువ రూ .700 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. దుబాయ్‌కి చెందిన హవాలా ఆపరేటర్ పంకజ్ కపూర్, అతని అనుచరులపై ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఢిల్లీ , ముంబై నగరాల్లో 11 ప్రదేశాలలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 29.19 లక్షల నగదును,ఆదాయ పన్ను పత్రాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముఖ‍్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, హవాలా లావాదేవీల రికార్డులతో పాటు 150 షెల్ సంస్థలకు సంబంధించిన స్టాంపు పత్రాలు, వస్తువులను కూడా ఈడీ సీజ్ చేసింది. వీటితోపాటు ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కస్టం హౌస్ ఏజెంట్ కార్యాలయాలలో కూడా దాడులు నిర్వహించారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది.
కపూర్‌కు చెందిన 50కిపైగా కంపెనీలు భారతీయ కంపెనీలు రాధికా జెమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాయని ఈడీ ప్రాధమిక విచారణలో తేలింది. భారతదేశంలో నగదును సేకరించి, డైమండ్ల దిగుమతి పేరుతో విదేశాల్లోని సంస్థలకు జమ చేస్తున్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ విదేశీ కంపెనీలు కూడా పంకజ్ కపూర్ నియంత్రణలోనే ఉన్నాయని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లావాదేవీలకు సంబంధించి వివరాలను వెరిఫై చేస్తున్నామనీ, ఖాతాదారుల నుండి కూడా వివరణలు కోరనున్నామని తెలిపారు. అలాగే రూ .3,700 కోట్ల మరోహవాలా రాకెట్ కేసులో పంకజ్ కపూర్‌ను విచారిస్తున్నట్టు ఈడీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment