ముంబై: ముడిచమురు ధరల పెరుగుదల, వాణిజ్య యుద్ధ భయాలతో రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే 19 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం 0.54 శాతం క్షీణించి 68.61 వద్ద క్లోజయ్యింది. 2016 నవంబర్ 24 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం.
అప్పట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.73 వద్ద క్లోజయ్యింది. ముడిచమురు రేట్ల పెరుగుదలతో దేశ కరెంటు ఖాతా లోటు మరింత పెరుగుతుందని, ద్రవ్యోల్బణమూ ఎగుస్తుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు సైతం కరెన్సీ ట్రేడర్స్‌ను కలవరపరుస్తున్నాయని వివరించాయి.
ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒక దశలో 68.68 కనిష్ట స్థాయిని కూడా తాకింది. ఈ దశలో రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకోవడంతో పతనానికి కాస్త అడ్డుకట్ట పడినట్లు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. సెంటిమెంటు బలహీనంగా ఉందని, మద్దతు స్థాయిలను కనుగొనడం మరింత కష్టంగా మారుతోందని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఏడాది నవంబర్ నాటికల్లా ఇరాన్ నుంచి చమురు దిగుమతుల్ని ఆపేయాలంటూ మిత్రదేశాలకు అమెరికా డెడ్‌లైన్ విధించడంతో ముడిచమురు రేట్లు మళ్లీ ఎగిశాయి. అటు లిబియా, కెనడాల నుంచి సరఫరా తగ్గొచ్చన్న ఆందోళన కూడా ధరలను మరింత ఎగదోశాయి. ఇటు దేశీయంగా ఈక్విటీల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండటం రూపాయిపై మరింత ఒత్తిడి పెంచుతోంది. రూపాయి చివరిసారిగా 2016 నవంబర్ 24న చరిత్రాత్మక కనిష్ట స్థాయి 68.86ని తాకింది. ముగింపుపరంగా చూస్తే 2013 ఆగస్టు 28న ఆల్‌టైమ్ కనిష్టమైన 68.80 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment