40 పైసలు క్షీణించిన రూపాయి
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచడంతో డాలర్ బలపడింది. దీంతో డాలర్‌తో రూపాయి మారకం గురువారం 40 పైసలు క్షీణించి 67.83 వద్ద ముగిసింది. వచ్చే ఏడాది మరిన్ని రేట్ల పెంపు ఉండగలవనిఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో ఫారెక్స్ మార్కెట్లో ఆందోళన నెలకొంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న నేపథ్యంలో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం రూపాయిపై తీవ్రమైన ప్రభావం చూపిందనిఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు.
విదేశీ ఇన్వెస్టర్లు గురువారం ఈక్విటీ మార్కెట్లో రూ.612 కోట్ల విలువైన నికర అమ్మకాలు జరిపారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం ఇది వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్, ఇక స్టాక్‌మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురికావడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపించింది. గత నెల 15 తర్వాత అంటే ఒక నెల కాలంలో రూపాయి ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి.
మరింత పతనం: కోటక్ రూపాయి మరింత పతనమవుతుందని కోటక్ ఇన్‌స్టిషనల్ ఈక్విటీస్ అంచనా వేస్తోంది. భవిష్యత్తులో డాలర్‌తో రూపాయి మారకం 67–71 రేంజ్‌లో ఉండగలదని పేర్కొంది. అయితే ఈ స్థాయిలో క్షీణించినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉండడం వల్ల ఇతర వర్థమాన దేశాల కరెన్సీలతో పోల్చితే మన రూపాయి మంచి స్థితిలో ఉన్నట్లేనని వివరించింది. వివిధ దేశాల విధానాలు డాలర్‌ను మరింత శక్తివంతం చేస్తాయని పేర్కొంది. ఆర్‌బీఐ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని తెలిపింది.