
17 నెలల గరిష్టానికి రూపాయి
37 పైసల లాభంతో 65.04 వద్ద ముగింపు
ముంబై: రూపాయి జోరు పెరుగుతోంది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం 37 పైసలు లాభపడి 65.04 వద్ద ముగిసింది. ఇది 17 నెలల గరిష్ట స్థాయి. రూపాయి ఒక్క రోజులో ఇన్ని పైసలు లాభపడడం ఈ ఏడాది ఇది రెండో సారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఆరోగ్య సంరక్షణ బిల్లుకు చుక్కెదురవ్వడంతో స్పెక్యులేటర్లు, ట్రేడర్లు డాలర్లను తెగనమ్మారని, దీంతో రూపాయి ఈ రేంజ్‌లో పెరిగిందని నిపుణులంటున్నారు.
ఫారెక్స్ మార్కెట్లో గత శుక్రవారం నాటి ముగింపు(65.41)తో పోల్చితే డాలర్‌తో రూపాయి మారకం 65.27 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65.01 గరిష్ట స్థాయిని తాకి చివరకు 37 పైసల (0.57 శాతం)లాభంతో 65.04 వద్ద ముగిసింది.
దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలు రానున్నాయనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరుగా ఉండడం, విదేశీ కరెన్సీలతో పోల్చితే డాలర్ బలహీనపడుతుండడం వంటి కారణాల వల్ల రూపాయి బలపడుతోందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు.