
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ దూసుకెళ్లింది. శుక్రవారం ఒకే రోజు డాలర్‌తో 100 పైసలు బలపడి 72.45కు వచ్చేసింది. గడిచిన ఐదేళ్లలో (2013 సెప్టెంబర్ తర్వాత) రూపాయి ఒకే రోజు ఇంతగా లాభపడిన సందర్భం ఇదే. చమురు ధరలు శాంతించడం, ఇరాన్ నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌కు అమెరికా మినహాయింపునిచ్చే అవకాశాలు, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల రాక రూపాయిని బలపడేలా చేశాయి.
గురువారం కూడా రూపాయి 50 పైసలు పెరగడంతో రెండు రోజుల్లోనే మొత్తం 150 పైసల మేర లాభపడినట్టయింది. తొలుత ఫారెక్స్ మార్కెట్లో 73.14 వద్ద రూపాయి ట్రేడింగ్ ఆరంభం కాగా, ఇంట్రాడేలో 72.43 వరకు రికవరీ అయింది. చమురు ధరలు దిగిరావడంతో కరెంటు ఖాతా లోటుపై ఆందోళనలు చల్లబడడం రూపాయికి జోష్‌నిచ్చాయి. బ్రెంట్ క్రూడ్ గత నెలలో 86.74 డాలర్ల స్థాయి వరకు వెళ్లగా, తాజాగా 73 డాలర్ల దిగువకు రావడం గమనార్హం. ‘‘చమురు ధరలు ఏడు నెలల కనిష్ట స్థాయికి వచ్చేశాయి. గరిష్ట ధర నుంచి 17 శాతం తగ్గాయి. ప్రధాన చమురు దేశాల నుంచి ఉత్పత్తి అధికం కావడం ఇందుకు తోడ్పడింది’’ అని ఓ విశ్లేషకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment