
ముంబై: డాలర్‌తో రూపాయి కాస్త బలపడింది. సోమవారం నాటి క్లోజింగ్ 68.80తో పోలిస్తే మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో 23 పైసలు బలపడి 68.57 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 68.91 వరకు క్షీణించగా, ఆ తర్వాత నష్టాలను పూడ్చుకుని లాభా ల్లోకి ప్రవేశించింది. గతవారం జీవిత కాల కనిష్ట స్థాయి 69.10కి పడిపోయిన విషయం తెలిసిందే.
ఎగుమతిదారులు, కార్పొరేట్లు తాజాగా డాలర్ల విక్రయానికి మొగ్గుచూపడం, అదే సమయంలో ఆర్‌బీఐ జోక్యం చేసుకుని డాలర్ల విక్రయాలు కొనసాగేలా చూడటం రూపాయి రికవరీకి దారితీసిందని ట్రేడర్లు పేర్కొన్నారు. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కూడా సానుకూల ప్రభావం చూపించింది. మొత్తం మీద ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పట్ల బుల్లిష్ ధోరణి కనిపించింది.
రూపాయిపై ఆందోళన అక్కర్లేదు
రూపాయి మారకం విలువ అంతకంతకూ క్షీణిస్తుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. వాస్తవ మారక విలువ (ఆర్‌ఈఈఆర్)పరంగా చూస్తే రూపాయి మారకం విలువ ఇప్పటికీ ఇంకా అధిక స్థాయిలోనే ఉందని ఆయన చెప్పారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2013లో.. కేవలం మూడు నెలల వ్యవధిలోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 57 నుంచి 68కి పడిపోయిందని, ఈ విషయంలో ప్రభుత్వాల పనితీరును పోల్చి చూడటానికి లేదని విలేకరుల సమావేశంలో రాజీవ్ కుమార్ తెలిపారు.
రూపాయి విషయంలో తగిన విధంగా స్పందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు వివరణనిచ్చారు. మరోవైపు, ఐడీబీఐ బ్యాంకును ఎల్‌ఐసీ టేకోవర్ చేసే అంశంపై స్పందిస్తూ.. ఐడీబీఐ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్‌ఐసీ గణనీయంగా లాభపడగలదని రాజీవ్ కుమార్ చెప్పారు. ఐడీబీఐ బ్యాంక్ త్వరలోనే టర్నెరౌండ్ కాగలదన్నారు. జీడీపీపరంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.5%గాను, వచ్చేసారి 8% స్థాయిలోనూ ఉండగలదని తెలిపారు. 2022 నాటికి స్థూలదేశీయోత్పత్తి వృద్ధి రేటు 8.5%కి చేరుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు.