ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత పతనమవుతోంది. ఈ పతనంలో ఏ రోజుకారోజు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది కూడా. వారం ప్రారంభం రోజునే ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ గత శుక్రవారంతో పోలిస్తే 30 పైసలు పతనమై, 74.06 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 74.10కి సైతం పడిపోయింది. నిజానికి రెండు నెలల కిందట అసలు రూపాయి 74 స్థాయికి వస్తుందని ఎవరూ కల లో కూడా అనుకోలేదు.
ఈ ఏడాది ఆగస్టు రెండో వారం వరకూ 68–69 స్థాయిని మించని రూపాయి... ఆగస్టు రెండో వారంలో మాత్రం తొలి సారిగా 70 స్థాయికి చేరింది. ఆ తరువాతి నుంచీ పెరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు కొత్త రికార్డు స్థాయికి పడిపోతూనే ఉంది. గత శుక్రవారం ముగింపు 73.76 కాగా... సోమవారం ప్రారంభంతోనే గ్యాప్‌డౌన్‌తో 14 పైసలు మైనస్‌తో 73.90 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 73.76కి చేరింది. కానీ అక్కడ నిలబడలేకపోయింది. చివరకు 74ను కూడా దాటేసి కొత్త రికార్డు స్థాయిలకు జారిపోయింది.
ఇవీ... ప్రధాన కారణాలు: అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వృద్ధి బాటలో పయనిస్తోంది. చాలా దృఢంగా ఉంది. ఆ నేపథ్యంలో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేట్లు పెంచుతోంది. ఫలితంగా దీనితో బాండ్లపై వచ్చే ఈల్డ్స్ (రాబడి) ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఈ ప్రయోజనాన్ని పొందటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాలర్ పెట్టుబడులు అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నాయి. అందులో భాగంగానే మన మార్కెట్ల నుంచి కూడా విదేశీ పెట్టుబడులు తరలి వెళుతున్నాయి. అవి రూపాయి పతనానికి కారణంగా నిలుస్తున్నాయి.
♦ దీనికితోడు అక్టోబర్ 5 పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రేట్లు కనీసం పావుశాతమయినా పెంచకపోవడంతో ఇక్కడ వచ్చే రాబడి పెరిగే అవకాశం లేదన్నది రూఢీ అయిపోయింది. ఇది రూపాయి పతన ధోరణిని మరింత తీవ్రం చేసింది.
♦ ఇక డాలర్ ఇండెక్స్ పటిష్ట ధోరణితో పాటు మన దేశం ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ ధరలు ఎగస్తున్నాయి. దీనితో దేశీయంగా వాణిజ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యోల్బణం పెరుగుతాయన్న భయాలు నెలకొన్నాయి. ఇవి రూపాయిని పతన దిశగా తోస్తున్నాయి.
♦ రూపాయి వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్ల నుంచీ ఏ రోజుకారోజు కొత్త రికార్డులను నమోదుచేసుకుంటోంది. కేంద్రం, ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకున్నా తగిన ప్రయోజనం కనిపించడం లేదు. నిజానికి ఆర్‌బీఐ రేటు పెంపు లేదని తెలిసిన వెంటనే రూపాయి శుక్రవారం 74.23కు పడిపోయింది. అయితే భయపడాల్సిన పనిలేదని ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించటంతో కొంత కోలుకుని 73.76 వద్ద ముగిసింది. కానీ సోమవారం మళ్లీ పతనం బాట పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment