
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం భారీగా పతనమైంది. ఐదు గంటలకు ముగిసే ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో 56 పైసలు పతనమై 68.07వద్ద ముగిసింది. ఇది 16 నెలల కనిష్ట స్థాయి. 2017 జనవరి 24న రూపాయి 68.15 వద్ద ముగిసింది.
మంగళవారం ఒక దశలో రూపాయి ఈ స్థాయిని చూసింది. కరెన్సీ మార్కెట్‌లో ఎగుమతిదారుల నుంచి డాలర్లకు భారీగా డిమాండ్ రావడమే దీనికి కారణం. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఈ వార్త రాసే సమయం రాత్రి 9 గంటలకు రూపాయి 68.23 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ 93పైన ట్రేడవుతోంది.
కారణాలు చాలానే...
♦ దేశంలో ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసమైన వాణిజ్యలోటు తీవ్రంగా పెరుగుతోంది. ఇది కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ,పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం)పై ఆందోళనలు సృష్టిస్తోంది.
♦ పెరుగుతున్న ముడి చమురు ధరలు నికర భారీ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారుతున్నాయి.
♦ ఈ అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుతుంద న్న భయాలకు కారణమవుతున్నాయి.
♦ దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గిపోతున్నాయి. మరోవంక డాలర్ ఇండెక్స్ ర్యాలీ కొనసాగుతోంది.
♦ జూన్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలున్నా యి. ఇది దేశం నుంచి క్యాపిటల్ అవుట్‌ఫ్లోకు దారితీయవచ్చనే ఆందోళన ఉంది.
♦ కరెన్సీ క్షీణతతో విదేశీ రుణాలకు సంబం ధించి కంపెనీలపై పెనుభారం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment