మేక్ ఫర్ ఇండియా ఉత్పత్తులపై ప్రధాన దృష్టి | Samsung Galaxy A9 Pro shows up on Zauba | Sakshi
Sakshi News home page

మేక్ ఫర్ ఇండియా ఉత్పత్తులపై ప్రధాన దృష్టి

Published Fri, Feb 5 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

మేక్ ఫర్ ఇండియా ఉత్పత్తులపై ప్రధాన దృష్టి

మేక్ ఫర్ ఇండియా ఉత్పత్తులపై ప్రధాన దృష్టి

కొత్త ఆవిష్కరణలపై కసరత్తు
శాంసంగ్ ఫోరంలో సంస్థ ప్రెసిడెంట్ హెచ్‌సీ హాంగ్
నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ
కౌలాలంపూర్ నుంచి  పార్థ సారథి నండూరి


భారత మార్కెట్లో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే  దిశగా మేక్ ఫర్ ఇండియా ఉత్పత్తుల రూపకల్పనపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ హెచ్‌సీ హాంగ్ తెలిపారు. భారత్‌లో దాదాపు 45వేల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని, సుమారు పన్నెండు వేల మంది పరిశోధన, అభివృద్ధి విభాగాల్లో ఉన్నారని ఆయన చెప్పారు. దీంతో పాటు ప్రాంతీయ అవసరాలకు అనుగుణమైన ప్రోడక్టుల తయారీ, నెట్‌వర్క్‌ను పటిష్టపర్చుకోవడం తదితర చర్యలపై ఈ ఏడాది మరింతగా కసరత్తు చేయనున్నట్లు ఆయన వివరించారు.

శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ఫోరంలో పాల్గొన్న సందర్భంగా హాంగ్ ఈ విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏ5, ఏ7 స్మార్ట్‌ఫోన్ల కొత్త వెర్షన్లతో పాటు ఫ్రిజ్‌లు, ఓవెన్లు తదితర పలు ఉత్పత్తులను ఆయన ఆవిష్కరించారు. గతేడాది స్మార్ట్‌ఫోన్లలో తమ మార్కెట్ వాటా 11 శాతం పెరిగిందని 34.5 శాతం నుంచి సుమారు 45.9 శాతానికి చేరిందని హాంగ్ వివరించారు. భారత్‌లో 4జీ సేవలు విస్తృతమవుతున్న నేపథ్యంలో తాము వివిధ ధరల శ్రేణిలో 18 మోడల్స్ హ్యాండ్‌సెట్స్‌ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. సొంత ఆపరేటింగ్ సిస్టం టైజెన్ ప్రధాన ఉత్పత్తులను మరింతగా అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు.

మొబైల్స్ కొత్త వెర్షన్లు..: శాంసంగ్ ఏ5, ఏ7 కొత్త వెర్షన్లు ఫిబ్రవరి 15 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. వీటి విక్రయాల కోసం ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ స్నాప్‌డీల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శాంసంగ్ ఇండియా మొబైల్స్ వ్యాపార విభాగం డెరైక్టర్ మను శర్మ తెలిపారు. అలాగే వీటి కొనుగోలుపై టెలికం సంస్థ ఎయిర్‌టెల్ 30 జీబీ డేటాను అందించనున్నట్లు వివరించారు. బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మరింత వేగంగా చార్జ్ అయ్యేలా వీటిని రూపొందించినట్లు శర్మ చెప్పారు. ఇందులో ఫింగ్‌ప్రింట్ స్కానర్, 13 ఎంపీ (వెనుక) 5 ఎంపీ (ఫ్రంట్) కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. ఏ7 ధర రూ. 33,400, ఏ5 ధర రూ. 29,400 గా ఉండనుంది.

5 ఇన్ 1 రిఫ్రిజిరేటర్ .. స్మార్ట్ ఏసీలు..
విద్యుత్‌ను ఆదా చేసే విధంగా అయిదు కన్వర్షన్ ఫీచర్లతో స్మార్ట్ కన్వర్టబుల్ 5 ఇన్ 1 రిఫ్రిజిరేటర్లను శాంసంగ్ ఆవిష్కరించింది. ఇందులో ఫ్రిజ్, ఫ్రజర్ కంపార్ట్‌మెంట్‌లకు వేర్వేరు కూలింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చని, దీంతో సందర్భాన్ని బట్టి విద్యుత్‌ను ఆదా చేయొచ్చని  కంపెనీ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటానీ తెలిపారు.

393-  670 లీటర్ల సామర్థ్యంతో లభించే ఈ ఫ్రిజ్‌తో విద్యుత్ దాదాపు 74 శాతం మేర ఆదా అవుతుంది.. మరోవైపు, వాషింగ్ జరుగుతుండగానే మరిన్ని దుస్తులను జోడించే వీలు కల్పించే వాషింగ్ మెషీన్‌ను ప్రవేశపెట్టారు. అటు, మరింత స్పష్టమైన చిత్రాన్ని అందించే క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ అల్ట్రాహెచ్‌డీ టీవీలను ఆవిష్కరించారు ఇది టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మరోవైపు, దాదాపు 68 శాతం దాకా విద్యుత్‌ను ఆదా చేసే విధంగా భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన స్టార్‌ఫ్లవర్ ఏసీలను శాంసంగ్ ఆవిష్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement