శాంసంగ్.. 2016 విశ్వసనీయమైన బ్రాండ్ ..
ముంబై: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ మొబైల్స్ దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. టాప్-5లో కేవలం ఒకే ఒక దేశీ సంస్థ టాటా గ్రూప్ చోటు దక్కించుకుంది. ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్-ఇండియా స్టడీ 2016’ పేరుతో ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (టీఆర్‌ఏ) ఒక సర్వే నిర్వహించింది. విశ్వసనీయమైన టాప్-5 బ్రాండ్స్‌లో శాంసంగ్ మొబైల్స్, సోనీ, ఎల్‌జీ, నోకియా, టాటా కంపెనీలు ఉన్నాయి. గతేడాది ఎల్‌జీ అగ్ర స్థానంలో, శాంసంగ్ రెండోస్థానంలో ఉండేవి. ఈ ఏడాది శాంసంగ్ టాప్‌లోకి వెళ్లింది. ఇక టాటా స్థానం 4 నుంచి 5కి పడింది. రిలయన్స్ స్థానం 14 నుంచి 22కు క్షీణించింది. మారుతీ సుజుకీ స్థానం మాత్రం 16 నుంచి 11కి మెరుగుపడింది. హీరో మోటోకార్ప్ 14వ స్థానంలో నిలిచింది.