
బ్యాంకుల్లో ఎస్‌బీఐ అగ్రగామి... వేతనంలో కాదు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని 50 అగ్రగామి బ్యాంకుల్లో ఒకటిగా ఎస్‌బీఐ స్థానం సంపాదించుకుంది. కానీ, దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ చీఫ్ పారితోషికం చాలా తక్కువ. బ్యాంకుల వార్షిక నివేదికల ప్రకారం చూస్తే... ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న వేతనం రూ.28.96 లక్షలు. అదే ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందాకొచర్ వేతనం రూ.2.66 కోట్లు. దీనికి అదనంగా రూ.2.2 కోట్ల పనితీరు ఆధారిత బోనస్ కూడా అందుకున్నారు. యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ బేసిక్ వేతనం రూ.2.7 కోట్లు కాగా, అలవెన్స్‌ల రూపేణా ఆమెకు మరో రూ.90 లక్షలు లభించాయి.
ఇక యెస్ బ్యాంకు ఎండీ, సీఈవో రాణా కపూర్ రూ.6.8 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్య పురి పారితోషికం రూ.10 కోట్లు. దీనికి తోడు గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ ఆప్షన్లను విక్రయించి ఆయన రూ.57 కోట్లను సొమ్ము చేసుకున్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ ఈ అంశాన్ని గతేడాది ఆగస్ట్‌లోనే ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఇంత తక్కువ వేతనాలతో ప్రతిభావంతులను ఆకర్షించడం కష్టమని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా రూ.6లక్షల కోట్ల ఎన్‌పీఏలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.