
న్యూఢిల్లీ: నిధుల కటకటతో కష్టాలుపడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లను ఆదుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ముందుకు వచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులను(రుణ పోర్ట్‌ఫోలియోలను) రూ.45,000 కోట్ల మేర కొనుగోలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్వీట్ చేశారు. ఈ ఎస్‌బీఐ నిర్ణయంతో ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్య తీరుతుందని ఆయన పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు రుణాల చెల్లింపుల్లో విఫలం కావడం.. ఈ ప్రభావం ఎన్‌బీఎఫ్‌సీలు, మ్యూచువల్ ఫండ్స్‌పై తీవ్రంగా ఉండటం తెలిసిందే.
మాకూ ప్రయోజనకరమే...
ప్రస్తుత ఏడాది రూ.15,000 కోట్ల మేర పోర్ట్‌ఫోలియో ఆస్తులు కొనుగోలు చేయాలని గతంలోనే నిర్ణయించామని ఎస్‌బీఐ ఎమ్‌డీ పి.కె. గుప్తా తెలిపారు. అయితే తాజా అంతర్గత మదింపు కారణంగా ఈ మొత్తాన్ని రూ.20,000 నుంచి రూ.30,000 కోట్లకు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు ఆకర్షణీయ ధరలకు లభిస్తుండటంతో ఇది తమకు మంచి వాణిజ్య అవకాశమని వివరించారు. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల ఎస్‌బీఐకీ, ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రయోజనకరమేనని తెలిపారు.
ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ సమస్య తీరుతుందని, మరోవైపు తమకు ఉత్తమమైన రుణ పోర్ట్‌ఫోలియోలు లభిస్తాయని వివరించారు. మరోవైపు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నియంత్రణ సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) సోమవారమే మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల రీఫైనాన్స్ పరిమితిని రూ.24,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచింది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీలకు కొంత ఊరట లభించనున్నది.
Comments
Please login to add a commentAdd a comment