
రూ.5,000 కోట్ల గృహ రుణాల లక్ష్యం
♦ ఈ ఆర్ధిక సంవత్సరంలో 25 శాతం వృద్ధి
♦ గృహ రుణాల తగ్గింపు జూలై 31 వరకే
♦ తెలంగాణలో కొత్తగా 100 ఏటీఎంల ఏర్పాటు
♦ మరో 200 ఏటీఎంల తరలింపు కూడా..
♦ ఎస్‌బీఐ తెలంగాణ సర్కిల్ సీజీఎం హర్దయాల్ ప్రసాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గృహ రుణాల వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. తెలంగాణలో రూ.5,000 కోట్ల గృహ రుణాల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 25 శాతం వృద్ధి రేటును లకి‡్ష్యంచామని ఎస్‌బీఐ తెలంగాణ సర్కిల్ సీజీఎం హర్దయాల్ ప్రసాద్ తెలిపారు. రూ.30 లక్షల్లోపు రుణాలకు 8.35 శాతం, రూ.30–70 లక్షల్లోపు రుణాలకు 8.50 శాతం వడ్డీ రేట్లుంటాయని.. ఈ రెండూ కూడా జులై 31 వరకే అందుబాటులో ఉంటాయని ఆయన తెలియజేశారు. మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత కారణంగా చాలా వరకు ఏటీఎంలు మూతపడి ఉంటున్నాయి. దీంతో ఏటీఎంలను తొలగిస్తున్నారనే అసత్య ప్రచారం జరుగుతోంది. అనుబంధ బ్యాంకుల విలీనంతో ఒకే చోట రెండు శాఖలు, ఏటీఎంలుంటే వాటిని తొలగించి వేరే చోటుకు తరలిస్తున్నామే తప్ప.. ఏటీఎంలను గానీ శాఖలను గానీ తీసేయటం లేదు’’ అని ఆయన వివరించారు. అనుబంధ బ్యాంకులతో కలిపి ప్రస్తుతం తెలంగాణలో ఎస్‌బీఐకు 1,301 శాఖలు, 17,800 ఏటీఎంలున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే 909 శాఖలు, 1,300 ఏటీఎంలున్నాయి. సెప్టెంబర్ నాటికి తెలంగాణలో కొత్తగా మరో 100 ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని, మరో 200 ఏటీఎంలను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తామని హర్దయాల్ తెలియజేశారు.
తెలంగాణలో రూ.20 వేల కోట్ల గృహ రుణాలు..
దేశంలో రూ.2.4 లక్షల కోట్ల గృహ రుణాలనందిస్తే.. ఇందులో 45 శాతం వాటా రూ.30 లక్షల్లోపు రుణాలదే. మొత్తం రుణాల పంపిణీలో తెలంగాణ వాటా రూ.20 వేల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో మెజారిటీ వాటా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలదేనని చెప్పారు. అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత మొండి బకాయిలు (ఎన్‌పీఏ) పెరిగాయని.. వచ్చే 6 నెలల్లో వీటి పరిష్కారానికి రోడ్‌మ్యాప్ రూపొందిస్తామని చెప్పారు. రీపేమెంట్ సరిగా ఉంటే మరింత ఎక్కువ మొత్తంలో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించే వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ డీజీఎం (రియల్ ఎస్టేట్ అండ్ హౌజింగ్ బిజినెస్ యూనిట్) వీ సంబంధన్, జీఎం గిరిధార కీనీ కూడా పాల్గొన్నారు.