సాక్షి, ముంబై : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించడంతోపాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ‘సప్నా ఆప్‌కా, భరోసా ఎస్‌బీఐ కా’ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం ఎస్‌బీఐ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి గడువు లోగా ప్రాజెక్టు పూర్తికాకపోతే డబ్బు వాపస్ ఇస్తామంటోంది. ‘రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారంటీ (ఆర్‌బీబీజీ)’గా తీసుకొస్తున్న ఈ పథకాన్ని తొలుత ముంబై నగరంలో ప్రారంభించింది. ఈ మేరకు ఇప్పటికే సన్ టెక్ డెవలపర్స్ సంస్థతో ఎస్‌బీఐ ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
తమ ఈ పథకం వల్ల అటు గృహ కొనుగోలుదారులు, ఇటు బిల్డర్లకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇది దేశ రియల్ ఎస్టేట్ రంగంపై బలమైన, సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో ప్రారంభించిన ఈ పథకాన్ని క్రమంగా ఈ దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రేరా, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాల నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు సమయానికి ప్రాజెక్టులను అందించటంతో పాటు, వారి డబ్బులు ఇరుక్కుపోకుండా ఈ కొత్త పథకం రక్షణ కల్పిస్తుందని రజనీష్ కుమార్ భరోసా ఇచ్చారు.
ఎన్నో ఆశలతో సొంతింటి కల సాకారం కోసం బ్యాంకురుణాలు తీసుకొని మరీ సొమ్మును పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుపెట్టి, అవి సమయానికి పూర్తికాక మధ్యలో నిలిచిపోవడంతో ఇబ‍్బందులు పడుతున్నవినియోగదారులకు పరిష్కారంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు బ్యాంకు తెలిపింది. ఈ పథకం గరిష్టంగా రూ 2.5 కోట్ల విలువ ఉన్న గృహాలకు వర్తిస్తుంది. అలాగే ఈ పథకంలో చేరే బిల్డర్లు తమ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు సుమారు రూ 50 కోట్ల నుంచి రూ 400 కోట్ల వరకు రుణాలను పొందవచ్చు. బిల్డర్ గడువులోగా వినియోగదారునికి ఇంటిని అందించలేకపోతే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ అమౌంట్ ను బ్యాంకు తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకం బిల్డర్ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు అమల్లో ఉంటుంది. మరిన్ని వివరాలు homeloans.sbi లో లభ్యం.
#SBI launched ‘Sapna Aapka Bharosa SBI Ka’ - Residential Builder Finance with Buyer Guarantee, to protect home buyers & boost the real estate sector. A MOU was signed by #SBI & Sunteck Realty Ltd., in Mumbai, followed by a press conference by Shri Rajnish Kumar, Chairman SBI. pic.twitter.com/SjRhG0b86C
— State Bank of India (@TheOfficialSBI) January 9, 2020
Comments
Please login to add a commentAdd a comment