చేయి కలిపిన ఎస్బీఐ... కైక్సాబ్యాంక్
దేశంలో ‘వ్యాపార’ విస్తరణ లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్-స్పెయిన్ జాయింట్ వెంచర్లు (జేవీ), భారత్ సంస్థలకు ఆర్థిక చేయూతను అందించడం లక్ష్యంగా భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), స్పెయిన్‌కు చెందిన కైక్సా బ్యాంకులు చేతులు కలిపాయి. సంయుక్తంగా రుణాలు అందించడం ప్రత్యేకించి బ్యాంక్స్ గ్యారెంటీ లావాదేవీల బిజినెస్ విస్తరణకు ఈ ఒప్పందం ద్వారా ప్రయత్నిస్తామని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ సుజిత్ కుమార్ వర్మ, కైక్సా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ (ఇంటర్నేషనల్ బ్యాంకింగ్) విక్టోరియా మాటియాలు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.
సిండికేటెడ్ లోన్ బిజినెస్, గ్యారెంటీ లావాదేవీలు, నెట్‌వర్కింగ్ సేవలు, ట్రేడ్ ఫైనాన్స్, ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ ఫైనాన్స్, ఇన్‌ఫ్రా ఫైనాన్స్ అంశాల్లో రెండు బ్యాంకులు పరస్పరం సహకరించుకుంటాయని ప్రకటన వెల్లడించింది. తమ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించుకోవడానికి రెండు బ్యాంకుల కస్టమర్లకూ ఈ ఒప్పందం దోహదపడుతుందనీ వివరించింది. కైక్సా బ్యాంక్ 2011లో న్యూఢిల్లీలో తన రిప్రజెంటేటివ్ ఆఫీస్‌ను ప్రారంభించింది. దక్షిణాసియా ప్రాంతంలో స్పెయిన్ కంపెనీల అభివృద్ధికి బ్యాంక్ తోడ్పాటును అందించడంతోపాటు, స్పెయిన్‌తో వ్యాపార లావాదేవీలు నిర్వహించే భారత కంపెనీలకు సైతం సహాయసహకారాలను అందిస్తోంది.