
గృహ కొనుగోలుదారులకు ‘ఎస్‌బీఐ రియల్టీ’ పోర్టల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ.. గృహాల కొనుగోలు దారుల కోసం ప్రత్యేకంగా ’ఎస్‌బీఐరియల్టీడాట్‌ఇన్’ పేరిట పోర్టల్ ప్రారంభించింది. ఆమోదం పొందిన 3,000 పైచిలుకు ప్రాజెక్టుల్లోని 9.5 లక్షల దాకా గృహాల వివరాలు ఇందులో ఉంటాయి. కొనుగోలుదారులు తమకు అనువైన ప్రాజెక్టును ఎంచుకుని ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఈ పోర్టల్ తోడ్పడనుంది.
మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని (యూటీ) 30 నగరాల్లో ఈ ప్రాజెక్టులు విస్తరించి ఉన్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. కస్టమర్లు ఆయా ప్రాంతాల్లోని ప్రాపర్టీల ప్రస్తుత, గత ధరల సరళని మొదలైనవి పోల్చి చూసుకోవచ్చని, ఆదాయం.. రుణ పరపతి ఆధారంగా ఎంత వరకూ రుణం తీసుకోవచ్చన్న విషయంలోనూ పోర్టల్ తోడ్పడుతుందని ఎస్‌బీఐ ఎండీ రజనీష్ కుమార్ పేర్కొన్నారు.