ముంబై : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్ బీఐ నికర లాభాలను 66శాతం కోల్పోయింది. మొండిబకాయిల ఒక్కసారిగా రూ.1లక్ష కోటికి పెరగడంతో ఎస్ బీఐ తన నికర లాభాలు పడిపోయాయని ప్రకటించింది. శుక్రవారం వెల్లడించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో ఎస్ బీఐ కేవలం రూ.1,264 కోట్ల నికర లాభాలనే చూపించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఎస్ బీఐ నికర లాభాలు రూ.3,742 కోట్లగా ఉన్నాయి. మార్కెట్ విశ్లేషకులు భావించిన దానికంటే అధికంగానే ఎస్ బీఐ నికరలాభాలు పడిపోయాయి.
గత త్రైమాసికంలో రూ.72,792 కోట్లగా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ త్రైమాసికంలో రూ.98,173 కోట్లకు ఎగబాకాయి. అదేవిధంగా వసూలు కాని రుణాల ప్రొవిజన్లు రూ.12,140 కోట్లగా నమోదయ్యాయి. ఇవి గత త్రైమాసికంలో రూ.7,645 కోట్లగానే ఉన్నాయి. అయితే మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ఎస్ బీఐ ఫలితాలు కొంత మెరుగ్గానే ఫలితాలను చూపించింది. చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ మార్చి త్రైమాసికంలో నష్టాలను నమోదుచేశాయి.12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ.20,500 కోట్ల నష్టాలను నమోదుచేశాయి.