ఎస్‌బీఐకి మొండిబకాయిల సెగ | SBI net dips 14% as bad loans, provisioning rise | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐకి మొండిబకాయిల సెగ

Published Tue, Aug 13 2013 1:30 AM | Last Updated on Tue, Aug 28 2018 8:05 PM

ఎస్‌బీఐకి మొండిబకాయిల సెగ - Sakshi

ఎస్‌బీఐకి మొండిబకాయిల సెగ

ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌కు రూ. 3,241 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఏప్రిల్-జూన్‌లో ఆర్జించిన రూ. 3,752 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14% క్షీణత. ప్రధానంగా వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమల్లో(ఎస్‌ఎంఈ) పెరిగిన మొండిబకాయిలకు కేటాయింపులు లాభాలను దెబ్బతీశాయి. ఇవికాకుండా విదేశీ కార్యకలాపాలు,  ఉద్యోగుల పెన్షన్‌కు చేపట్టిన రూ. 1,100 కోట్ల ప్రొవిజన్లు కూడా ప్రభావం చూపాయి. ఇదే కాలానికి బ్యాంకు ఆదాయం మాత్రం రూ. 32,415 కోట్ల నుంచి రూ. 36,193 కోట్లకు ఎగసింది. స్టాండెలోన్ ఫలితాలివి. కాగా, సమయానుకూల రుతుపవనాల కారణంగా వ్యవసాయం, ఎస్‌ఎంఈ రంగాలు పుంజుకునే అవకాశమున్నదని బ్యాంకు చైర్మన్ ప్రతీప్ చౌదరి పేర్కొన్నారు.
 
  యూఎస్ ట్రెజరీ బిల్లుల ద్వారా ఏర్పడ్డ నష్టాలకు రూ. 576 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టినట్లు వెల్లడించారు. దీంతోపాటు ఉద్యోగ సంబంధిత పెన్షన్లకు మరో రూ. 700 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. దీంతో లాభాలు ప్రభావితమయ్యాయని వివరించారు. ఉద్యోగుల సగటు జీవితకాల అంచనాను ఎల్‌ఐసీ ఐదేళ్లు పెంచడం ద్వారా 81 ఏళ్లకు చేర్చడంతో పెన్షన్ కేటాయింపులను చేపట్టాల్సి వచ్చినట్లు తెలిపారు. ఈ పద్దుకింద రానున్న మూడు క్వార్టర్లలో కూడా రూ. 600 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు ధర 3.4% క్షీణించి రూ. 1,605 వద్ద ముగిసింది. ఒక దశలో 5%పైగా పతనమై  రూ. 1,575ను తాకింది.
 
 కొత్త మొండిబకాయిలు: ప్రస్తుత సమీక్షా కాలంలో వ్యవసాయం నుంచి రూ. 3,245 కోట్లు, ఎస్‌ఎంఈ విభాగం నుంచి రూ. 2,500 కోట్ల చొప్పున మొండిబకాయిలు నమోదైనట్లు చౌదరి వివరించారు. మధ్యతరహా కార్పొరేట్ సంస్థల నుంచి కూడా బకాయిలు పెరిగినట్లు తెలిపారు. కొత్తగా నమోదైన రూ. 13,766 కోట్ల మొండిబకాయిల(వసూలు కానివి) కారణంగా మొత్తం ఆస్తులలో స్థూల మొండిబకాయిలు 4.99% నుంచి 5.56%కు పెరిగినట్లు వెల్లడించారు. ఇక నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.22% నుంచి 2.83%కు పెరిగాయి. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 12% తగ్గి రూ. 4,299 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం రూ. 4,875 కోట్లు నమోదైంది. ఇదే కాలానికి బ్యాంకు ఆదాయం మాత్రం రూ. 46,839 కోట్ల నుంచి రూ. 52,502 కోట్లకు ఎగసింది.
 
  నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 3.5% పెరిగి రూ. 11,512 కోట్లకు చేరగా, ఇతర ఆదాయం 28% ఎగసి రూ. 4,474 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 3.86% నుంచి 3.44%కు క్షీణించాయి. అయితే తొలుత ప్రకటించిన అంచనాలకు అనుగుణంగా 3.5-3.6% స్థాయిలో మార్జిన్లను నిలుపుకోగలమన్న ఆశాభావాన్ని చౌదరి వ్యక్తం చేశారు. విదేశీ కార్యకలాపాల మార్జిన్లు 1.5%గా నమోదైనట్లు అంతర్జాతీయ బ్యాంకింగ్ ఎండీ హేమంత్ జి.కాంట్రాక్టర్ చెప్పారు. ఈ కాలంలో రూ. 5,800 కోట్ల తాజా రుణాలను పునర్వ్యవస్థీకరించింది.  అనుబంధ బ్యాంకును ఒకదానిని విలీనం చేసుకునే విషయాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు ఎస్‌బీఐ అనుబంధ కంపెనీల గ్రూప్ ఎగ్జిక్యూటివ్, ఎండీ ఎస్.విశ్వనాథన్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement