ఎస్‌బీఐకి మొండిబకాయిల సెగ
ఎస్‌బీఐకి మొండిబకాయిల సెగ
Published Fri, Aug 11 2017 2:25 PM | Last Updated on Tue, Aug 28 2018 8:05 PM
ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాభాల్లో పడిపోయింది. మొండిబకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో, 2017-18 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకు లాభాలు 20.45 శాతం క్షీణించాయి. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో బ్యాంకు లాభాలు రూ.2,005.5 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు లాభాలు రూ.2,520.96 కోట్లగా ఉన్నాయి. బ్లూమ్‌బర్గ్ అంచనాల ప్రకారం బ్యాంకు రూ.2,955.90 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని భావించారు. కానీ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు గత క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్‌కు బాగా పెరిగాయి. గత క్వార్టర్‌లో 6.9 శాతమున్న స్థూల ఎన్పీఏలు ఈ క్వార్టర్‌లో 9.97 శాతానికి పెరిగాయి.
నికర ఎన్‌పీఏలు కూడా జూన్ క్వార్టర్‌లో 5.97 శాతానికి ఎగిశాయి. గత క్వార్టర్‌లో ఇవి కూడా 3.71 శాతంగానే ఉన్నాయి. అంతేకాక ప్రొవిజన్లు, కంటింజెన్సీస్ 53.1 శాతం పెరిగి రూ.21,054.74 కోట్లగా ఉన్నాయి. రుణాలు ఇవ్వడం ద్వారా బ్యాంకు ఆర్జించిన కోర్ ఆదాయం లేదా నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ)లు 22 శాతం పెరిగి రూ.17,606.01 కోట్లగా రికార్డయ్యాయి. ఇవి గతేడాది రూ.14,437.31 కోట్లుగానే ఉన్నాయి. ఇతర ఆదాయాలు 11.03 శాతం ఎగిసి రూ.8,005.66 కోట్లగా బ్యాంకు ప్రకటించింది. ఫలితాల ప్రకటనలో బ్యాంకు లాభాలు 20 శాతం మేర పడిపోవడం, మొండిబకాయిలు ఎగియడంతో బ్యాంకు షేరు 5.02 శాతం క్షీణించి రూ.281.80గా నమోదవుతోంది.
Advertisement