ముంబై : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాభాలు బాగా పడిపోయాయి. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో ఏడాది ఏడాదికి బ్యాంకు స్టాండలోన్ నికర లాభాలు 37.7 శాతం కిందకి దిగజారి, రూ.1,581.55 కోట్లగా రికార్డయ్యాయి. ఇవి విశ్లేషకులు అంచనావేసిన దానికంటే కూడా తక్కువే. ఈ క్వార్టర్‌లో బ్యాంకు రూ.2,700 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. గతేడాది ఇదే క్వార్టర్‌లో బ్యాంకు నికర లాభాలు రూ.2,538.32 కోట్లగా ఉన్నాయి. అయితే నికర వడ్డీ ఆదాయాలు అంచనావేసిన దానికంటే మెరుగ్గానే ఉన్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం బ్యాంకు నికర ఆదాయం రూ.18,372 కోట్లు ఉంటుందని ఈటీ పోల్‌లో తేలగా.. అవి రూ.18,595 కోట్లగా రికార్డయ్యాయి.
సీక్వెన్షియలీ ఇవి 5.57 శాతం, ఏడాది బేసిస్‌లో 2.58 శాతం పెరిగాయి. వడ్డీరహిత ఆదాయం క్వార్టర్ క్వార్టర్‌కు రూ.100.96 శాతం వృద్ది నమోదై, రూ.16,016 కోట్లగా ఉన్నాయి. విలీనం చేసిన దేశీయ వ్యాపారాల నికర వడ్డీ మార్జిన్లు 2.59 శాతం పడిపోయాయి. సీక్వెన్షియల్ బేసిస్‌లో బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తులు ఈ క్యూలో 9.83 శాతంగా నమోదయ్యాయి. గత క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్‌కు కొద్దిగా తగ్గినప్పటికీ, ఏడాది ఏడాదికి మాత్రం బాగానే పెరిగినట్టు బ్యాంకు తన ఫలితాల ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 7.14 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా నికర నిరర్థక ఆస్తులు క్వార్టర్ క్వార్టర్‌కు 5.97 శాతం నుంచి 5.43 శాతానికి పడిపోయాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఎస్‌బీఐ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 4.51 శాతం లాభంలో రూ.328.25 వద్ద ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment