ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 69 శాతం జంప్‌చేసి రూ. 8,890 కోట్లను తాకింది. ఇది ఒక త్రైమాసికానికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 5,246 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 95,374 కోట్ల నుంచి రూ. 1,01,143 కోట్లకు ఎగసింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 67 శాతం ఎగసి రూ. 7,627 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 4,574 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 31,184 కోట్లను తాకింది.
ప్రొవిజన్లు తగ్గాయ్
క్యూ2లో ఎస్‌బీఐ స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 5.28 శాతం నుంచి 4.9 శాతానికి క్షీణించాయి. నికర ఎన్‌పీఏలు సైతం 1.59 శాతం నుంచి 1.52 శాతానికి మెరుగుపడ్డాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 5,619 కోట్ల నుంచి రూ. 2,699 కోట్లకు భారీగా తగ్గాయి. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 0.16 శాతం బలపడి 3.5 శాతంగా నమోదయ్యాయి. కోవిడ్–19 అనిశ్చితుల నేపథ్యంలో తాజాగా చేపట్టిన రూ. 2,884 కోట్లతో కలిసి మొత్తం ప్రొవిజన్లు రూ. 6,181 కోట్లకు చేరాయి. సెప్టెంబర్‌కల్లా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 13.35 శాతానికి చేరింది.
రైట్ బ్యాక్‌ఇలా..
క్యూ2లో ఎస్‌బీఐ తాజా స్లిప్పేజీలు రూ. 4,176 కోట్లుకాగా.. రికవరీలు రూ. 7,407 కోట్లుగా నమోదయ్యాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చేపట్టిన రూ. 4,000 కోట్ల ప్రొవిజన్లను రైట్‌బ్యాక్ చేసింది. మొత్తం ప్రొవిజన్లు 74 శాతంపైగా తగ్గి రూ. 3,034 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల అడ్వాన్సులు(రుణాలు) 6.2 శాతం పెరిగి రూ. 25,30,777 కోట్లను తాకాయి. డిపాజిట్లు దాదాపు 10% వృద్ధితో రూ. 38,09,630 కోట్లకు చేరాయి.
షేరు జోరు...
క్యూ2 ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు బీఎస్‌ఈలో 1.2 శాతం బలపడి రూ. 528 వద్ద ముగిసింది. తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 542ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!
లాభదాయకత అప్
క్యూ2లో పలు లాభదాయక అంశాలలో బ్యాంక్ పటిష్ట పనితీరు చూపింది. తద్వారా ఒక క్వార్టర్‌లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభం ఆర్జించింది. వసూళ్లు పుంజుకోవడం, అండర్‌రైటింగ్ మెరుగుపడటం వంటి అంశాలు భవిష్యత్ రుణ నాణ్యతపై ఆందోళనలకు చెక్ పెట్టాయి. ఇకపై రిటైల్ రుణాల్లో భారీ వృద్ధిని అంచనా వేస్తున్నాం.
– దినేష్ ఖారా, చైర్మన్, ఎస్‌బీఐ
Comments
Please login to add a commentAdd a comment