కార్పొరేట్ రుణ ఎగవేతదారులపై చర్యలు
ముంబై:కావాలనే రుణాలు ఎగవేసే వారిపై(విల్‌ఫుల్ డిఫాల్టర్స్) చర్యలకు సంబంధించి ఆర్‌బీఐతో సంప్రతింపులు జరుపుతున్నామని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు. సోమవారమిక్కడ బీఎస్‌ఈలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలోనే దీనికి సంబంధించిన నిబంధనలను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. మొండిబకాయిల పెరుగుదలపై ఆందోళనల నేపథ్యంలో విల్‌ఫుల్ డిఫాల్లర్ల జాబితాలో ఉన్న కంపెనీలు, ప్రమోటర్లు స్టాక్ మార్కెట్ల నుంచి ఎలాంటి నిధుల సమీకరణలూ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ సెబీని కోరిన సంగతి తెలిసిందే.
చట్టవిరుద్ధ నిధుల సమీకరణలపై ఉక్కుపాదం..
ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా నిధులను సమీకరించే సంస్థలపై సెబీ కొరడా ఝులిపిస్తోంది. కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్(సీఐఎస్)ల ద్వారా సుమారు రూ.4,000 కోట్లను సమీకరించిన పలు కంపెనీలను ఆయా పథకాలు రద్దు చేయాల్సిందిగా సెబీ ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 1 నుంచి కొత్త కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలు...
లిస్టెడ్ కంపెనీలకు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కొత్త కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను అమలు చేయనున్నట్లు సిన్హా తెలిపారు. అదేవిధంగా లిస్టింగ్ అగ్రిమెంట్ కొత్త నిబంధనలూ వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు.