
సెబీ సంచలన నిర్ణయం
ముంబై: మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ 19 సంస్థలపై నిషేధాన్ని ధృవీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. మనీలాండరింగ్,పన్నుఎగవేసినకేసులో ఇంకా విచారణ కొనసాగుతున్నందున 19సంస్థలు/వ్యక్తులపై నిషేధాన్ని ధ్రువీకరిస్తున్నట్లు సెబీ బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 29, 2015 నాటి మధ్యంతర ఉత్తర్వులు తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు అమలులో ఉంటాయి సెబి ఒక ప్రకటనలో వెల్లడించింది.
గత ఏడాది జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల్లో నాలుగు కంపెనీలు, ప్రస్తుత19 సంస్థలు సహా 235 ఇతర సంస్థల పై నిషేధం విధించింది. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నగదు బదిలీ ద్వారా రూ 614 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించినట్టు పేర్కొంది. ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఎస్టీమ్ బయో ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్, ఛానెల్ నైన్ ఎంటర్‌టైన్‌మెంట్, హెచ్‌పీసీ బయోసైన్సెస్ కంపెనీ షేర్లలో అవకతవకలు జరిగాయని సెబీ ఆరోపణ. జనవరి 1, 2013 - డిసెంబరు 31, 2014 మధ్య ఈ షేర్ల ట్రేడింగ్ లో షేర్ల పరిమాణం భారీగా పెరిగింద. కృత్రిమ ప్రాధాన్యత కేటాయింపులు, ఫేర్ల ధర, పరిమాణాన్ని పెంచడం ద్వారా అక్రమ లాభాలను ఆర్జించి స్టాక్ మార్కెట్ ను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై సెబీ ప్రాథమిక విచారణలో అక్రమాలు వెలుగు చూశాయి. మరోవైపు ఈ వ్యవహారంలో తదుపరి విచారణ కొనసాగుతుందని సెబీ అధికారి వెల్లడించారు.
కాగా, గతేడాది జూన్‌లో జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలను సవరించడం లేదా వెనక్కి తీసుకోవడానికి ఎలాంటి కారణమూ కనిపించలేదని సెబీ సభ్యుడు రాజీవ్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో సెబీ ఈ కంపెనీలపై నిషేధాన్ని ధ్రువీకరించిందన్నారు. ఈ 19 సంస్థలు/వ్యక్తుల్లో మధుకర్ దూబే, సతేంద్ర కుమార్, కోర్ క్యాపిటల్ సర్వీసెస్, మేఫెయిర్ ఇన్ ఫో సొల్యూషన్స్, చేతన్ ప్రకాశ్, అసిఫా జమాల్, ప్రకాశ్ గుప్తా, అభిషేక్ గుప్తాలున్నారు.