బీఓఆర్ మాజీ ప్రమోటర్లపై సెబీ కఠిన చర్యలు
ముంబై: ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ రాజస్తాన్ మాజీ ప్రమోటర్ల కుటుంబాలకు సంబంధమున్న ఏడు సంస్థలు చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ. 1.6 కోట్ల లాభాలను జప్తు చేయాలని స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. నిర్దేశిత మొతా ్తన్ని ఎస్క్రో ఖాతాలో జమచేసేంత వరకూ ఈ ఏడుగురు వ్యక్తులు/సంస్థలు ఎటువంటి ఆస్తులు, సెక్యూరిటీలు విక్రయించరాదని పేర్కొంది. అలాగే తమ ఆస్తుల వివరాలను 7 రోజుల్లోగా సమర్పించాలని సూచించింది. ఆయా వ్యక్తులు/ సంస్థల బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్ అకౌంట్ల నుంచి డెబిట్ లావాదేవీలేవీ జరగకుండా చూడాలని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలకు ఆదేశాలు జారీ చేసింది.
సెబీ చర్యలు ఎదుర్కొంటున్న వారిలో రోహిత్ ప్రేమ్‌కుమార్ గుప్తా, సంజయ్ కుమార్ తయాల్, నవీన్ కుమార్ తయాల్, జ్యోతికా సంజయ్ తయాల్, కుల్విందర్ కుమార్ నయ్యర్, ఆజం మొహమ్మద్ అషాన్ షేఖ్‌తో పాటు అద్విక్ టెక్స్‌టైల్స్, రియల్‌ప్రో సంస్థలు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌తో బీవోఆర్ విలీన ఒప్పంద సమయంలో బ్యాంక్ ఆఫ్ రాజస్తాన్ షేర్లు గణనీయంగా పెరగడం, ఇందులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ కోణం ఉండొచ్చన్న అనుమానాల దరిమిలా విచారణ జరిపిన సెబీ తాజా ఆదేశాలు ఇచ్చింది.