ఎగవేతదారులపై సెబీ కొరడా
నిధులు సమీకరించకుండా నిషేధం
♦ కంపెనీల బోర్డు పదవులకూ నో
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక చర్యలు తీసుకుంది. బ్యాంకు రుణాలఉ ఉద్దేశపూర్వకంగా ఎగవేసే వారి విషయంలో కఠిన నిర్ణయాలు అమలు చేయాలని నిర్ణయించింది. ఇలాంటి వారు షేర్లను, బాండ్లను జారీ చేసి జనం నుంచి నిధులు సమీకరించకుండా నిషేధం విధించింది. వీరికి కంపెనీల బోర్డుల్లోనూ ఎలాంటి పదవినీ చేపట్టే అర్హత ఉండదు. రుణ ఎగవేత ఆరోపణలున్న వ్యాపారి విజయ్ మాల్యాపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆయన వివిధ సంస్థల్లో వివిధ హోదాల్లో ఉన్నారు. అవన్నీ పోయే అవకాశముంది.
మరోవైపు, సెక్యూరిటీస్, కమోడిటీస్ మార్కెట్లలో అవకతవకలను అరికట్టేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు బ్రోకింగ్ సంస్థలు.. ఇతర మధ్యవర్తులపై పర్యవేక్షణ పెంచాలని కూడా సెబీ నిర్ణయించింది. శనివారం జరిగిన బోర్డు భేటీలో పాల్గొన్న అనంతరం సెబీ చైర్మన్ యూకే సిన్హా ఈ వివరాలు తెలిపారు. విల్‌ఫుల్ డిఫాల్టరుగా నిర్ధారణ అయిన వ్యక్తి లేదా కంపెనీని మార్కెట్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించనివ్వడం రిస్కుతో కూడుకున్నదని అన్నారు. నోటిఫై చేసిన తర్వాతి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. మరోవైపు, లిస్టెడ్ కంపెనీలను కొన్నప్పుడు యాజమాన్య అధికారాల బదిలీ, సంక్షోభంలో ఉన్న డెట్ సెక్యూరిటీల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు తదితర అంశాలనూ ఇందులో చర్చించారు. ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచేందుకు, కమోడిటీ డెరివేటివ్స్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని బోర్డు సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు.
బీఎస్‌ఈ ఐపీవోకు అనుమతులు ..
స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్‌ఈ ప్రతిపాదించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీవో)కు సూత్రప్రాయంగా అనుమతినిచ్చినట్లు సిన్హా తెలిపారు. దీంతో మరో 6-9 నెలల్లోగా బీఎస్‌ఈ ఐపీవోకు మార్గం సుగమమైంది. జనవరిలోనే ఐపీవో కోసం దరఖాస్తు చేసుకున్న తాము... ఇప్పటికే మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్లను నియమించుకున్నామని బీఎస్‌ఈ తెలిపింది.