
ఈ బంకర్లు బంగారం గాను..
• స్విస్ ఆల్ప్స్ పర్వతాల సమీపంలో నేల మాళిగలు
• ఒకప్పుడు సైనికులకు సేవలు..
• నేడు రహస్య బంగారం నిల్వలకు కేంద్రాలు
ఒకప్పుడు అవి సైనికుల బంకర్లు. ఇప్పుడు బంగారు బంకర్లు. అంటే టన్నుల కొద్దీ బంగారాన్ని రహస్యంగా నిల్వ చేసిన గోదాములు. నల్లధనానికి సురక్షిత స్థావరంగా పేరొందిన స్విట్జర్లాండ్‌లోనే ఇవి కూడా ఉండడం విశేషం.
స్విస్ ఆల్ప్స్ పర్వతాలు. విమానాలు, ఫాల్కన్ జెట్స్ దిగడానికి వీలుగా వాటి పక్కనే చిన్నపాటి ఎయిర్‌స్ట్రిప్. ఇక్కడేప్రపంచంలోనే భారీ పరిమాణంలో బంగారం నిల్వలు ఉంచిన బంకర్ కూడా ఉంది. ముఖ ద్వారం ముందు అత్యాధునిక ఆయుధాలు ధరించిన గార్డులతో కొత్త వారు అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేనంత కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది.
మూడున్నర టన్నుల ఇనుముతో కూడిన తలుపులు, కోడ్‌తోపాటు కనుపాపలు చూపించి అవి సరిపోలితే తప్ప తెరచుకోకుండా ఏర్పాట్లు. స్విట్జర్లాండ్ రక్షణ శాఖ సమాచారం ప్రకారం... ఆ దేశ వ్యాప్తంగా ఒకప్పుడు సైనికులకు సేవలు అందించిన వెయ్యి బంకర్లు (నేల మాళిగలు) ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీటిలో కొన్ని వందల బంకర్లను ఇటీవలే విక్రయించారు. వాటిలో ఓ పది బంకర్లు బంగారం నిల్వల కేంద్రాలుగా ఇప్పుడు సేవలందిస్తున్నాయి.
ఎవరి కోసం
పన్నులు ఎగ్గొట్టి, అక్రమ మార్గాల్లో కూడబెట్టిన నల్లధనాన్ని పసిడి రూపంలో భద్రపరచుకునేందుకు ఇవి సురక్షిత స్థావరాలుగా నిలుస్తున్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత నుంచి ఈ బంగారు బంకర్లకు డిమాండ్ పెరిగిపోయింది. బ్యాంకులు, బాండ్లు వంటి ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలపై రాబడులు తగ్గిపోయిన నేపథ్యంలో ఎక్కువ మంది బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపారు. అదే సమయంలో పన్ను అధికారుల పరిశీలనల నుంచి తప్పించుకోవడానికీ ఇవి ఓ మార్గంగా కనిపించాయి.
స్విస్ బ్యాంకుల వలే ఈ బంగారు ఖజానాల నిర్వాహకులు అనుమానిత లావాదేవీల గురించి ఫెడరల్ నియంత్రణ సంస్థలకు తెలియజేయాల్సిన బాధ్యత లేదు. అదే సమయంలో స్విట్జర్లాండ్ మనీ లాండరింగ్ విభాగానికి కూడా తెలియజేయాల్సిన పనిలేదు. అమెరికా ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్ట్ కింద ఆర్థిక సంస్థలకు బయట దాచుకున్న బంగారు నిల్వల గురించి అమెరికన్లు పన్ను అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత లేకపోవడం కూడా ఇక్కడ గమనార్హం.
క్లయింట్లకు ప్రవేశం లేదు
ఖాతాదారుల కోసం నిర్వాహకులు సకల సదుపాయాలను సమకూర్చడం ఆసక్తికరం. విమాన రన్‌వే పక్కన వీఐపీ లాంజ్, రెండు అత్యాధునిక లగ్జరీ అపార్ట్‌మెంట్లు, టీవీ తెరలు, నిద్రించడానికి, తినడానికి కూడా సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. క్లయింట్లను నేరుగా బంగారం నిల్వ చేసిన కేంద్రాలకు తీసుకెళ్లరు. అవి కచ్చితంగా ఎక్కడున్నాయో తెలియనీయరు. దీనికి బదులు చూసేందుకు వచ్చిన వారిని కంప్యూటర్ సర్వర్లు ఉన్న గదికి తీసుకెళ్లి వివరాలు తెలియజేస్తారు.
బంగారానికి డిమాండ్ ఉంది
‘2008 నుంచి బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా బంగారంపై ఆసక్తి పెరిగింది. ఈ డిమాండ్‌ను మేము ఒడిసిపట్టుకున్నాం’ అని ఓ అతిపెద్ద బంగారం నిల్వ కేంద్రాన్ని నిర్వహిస్తున్న స్విస్ డేటా సేఫ్ అనే సంస్థ సీఈవో డోల్ఫ్ విప్‌ఫ్లీ ఓ వార్తా సంస్థకు తెలిపారు. తాము కార్పొరేట్ క్లయింట్లనే బంగారం దాచుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు.
ఆరు నెలల్లో 1,359 మెట్రిక్ టన్నులు
స్విస్ కస్టమ్స్ కార్యాలయ సమాచారం ప్రకారం... ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 1,359 మెట్రిక్ టన్నుల బంగారం స్విట్జర్లాండ్‌కు దిగుమతి అయింది. దీని విలువ సుమారు 2.68 లక్షల కోట్లు (40 బిలియన్ డాలర్లు). బంగారం వాణిజ్యం అనేది స్విస్ ఆర్థిక రంగంలో ఓ భాగమని అమెరికా ట్రెజరీ మాజీ ఏజెంట్ జాన్ కస్సరా తెలిపారు. మరోవైపు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు నేరగాళ్లు బంగారాన్ని వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.